Zepto Delivers Skoda Kylaq: ప్రస్తుతం ఏ వస్తువు కొనాలన్నా ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు అంతా కాస్త ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్‌లపై మొగ్గు చూపిస్తున్నారు. ఇంట్లో కూర్చునే ఫోన్ ద్వారా తమకు కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. అదే సమయంలో వీటి డెలివరీలు కూడా త్వరగా జరగాలని కోరుకుంటున్నారు.
ప్రజల ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బ్లింకిట్ ఇటీవలే ఓ కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఆర్డర్ చేసిన కేవలం 10 నిమిషాల్లోనే కిరాణా సామాగ్రి (Groceries) కస్టమర్ల వద్దకు వచ్చి చేరుతుంది. ఆ తర్వాత బ్లింకిట్ తన సేవను గ్రోసరీస్‌తో పాటు అనేక ఇతర వస్తువులు, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌తో సహా అంబులెన్స్ సర్వీస్‌కు కూడా విస్తరించింది.
అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ క్విక్- కామర్స్ సంస్థ జెప్టో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. దీన్ని చూస్తే ఇప్పుడు కారు కూడా ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో కస్టమర్ ఇంటి వద్దకు డెలివరీ అవుతుందని అనిపిస్తుంది. ఏంటీ కారును ఆర్డర్ చేసిన కేవలం పదే నిమిషాల్లో ఇంటి వద్దకు చేరుతుందా? ఇది నిజమేనా? అంటే దీనిపై పూర్తి వివరాలు ఇవే!
Rushlane నివేదిక ప్రకారం..స్కోడా కంపెనీ జెప్టోతో భాగస్వామ్యం కలిగి ఉంది. దీంతో కేవలం 10 నిమిషాల్లోనే కస్టమర్ ఇంటికి కారును డెలివరీ చేసే సర్వీస్‌ను అందించారు. వాస్తవానికి స్కోడా ఆటో ఇటీవలే భారత మార్కెట్లో 'కైలాక్ SUV' పేరుతో కొత్త కారును విడుదల చేసింది. స్కోడా ఈ కారుపై చాలా ఎక్స్పెక్టేషన్లను పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ కారును లాంఛ్ చేయడంపై మాత్రమే కాకుండా వీలైనంత త్వరగా డెలివరీలు చేయడంపై కూడా దృష్టి సారించింది. దీంతో ఇది భారతదేశంలోని ప్రముఖ క్విక్-కామర్స్ కంపెనీ అయిన జెప్టోతో జత కట్టింది. తద్వారా తన కస్టమర్లకు ఈ కారును కొనుగోలు చేయడంలో కొత్త అనుభూతిని అందించేందుకు రెడీ అయింది.
జెప్టో ద్వారా కారు డెలివరీ:వాస్తవానికి జెప్టో సంస్థ దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ టీజర్‌ను విడుదల చేసింది. దీనిలో కొత్త కారు డెలివరీ సర్వీస్ గురించి సమాచారం అందించింది. జెప్టో రిలీజ్ చేసిన ఈ టీజర్ స్కోడా ఇండియా సహకారంతో రూపొందించారు. ఈ టీజర్‌లో జెప్టో డెలివరీ బాయ్ స్కోడా షోరూమ్‌కి వెళ్లి ఆర్డర్ తీసుకోవడానికి వచ్చానని చెప్పడం, షోరూమ్ లోపల దాన్ని పికప్ చేసుకోవడం వంటివి కన్పిస్తాయి.
ఆ తర్వాత షోరూమ్‌లో ఉన్న స్కోడా అధికారి జెప్టో డెలివరీ బాయ్‌కి తన ఆర్డర్ వైపు చూపిస్తాడు. ఆయన చూపించిన ఆర్డర్ కంపెనీ కొత్త సబ్-కాంపాక్ట్ SUV స్కోడా కైలాక్. అయితే ఈ యాడ్‌లో కనిపించిన మరో విశేషం ఏంటంటే జెప్టో డెలివరీ బాయ్‌కి తాను కారు డెలివరీ చేయడానికి వచ్చినట్లు తెలియకపోవడం. ఈ క్రేజీ వీడియో చివరలో 'స్కోడా x జెప్టో: కమింగ్ సూన్' అంటూ రాసుకొచ్చారు. అంటే త్వరలో స్కోడా, జెప్టో భాగస్వామ్యంలో కొత్త సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.