Whatsapp Video Status Length :అప్‌డేట్ల పరంగా ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే ఎన్నో కీలక మార్పులను తన అప్లికేషన్లో తీసుకువచ్చిన మెటా, తాజాగా మరో సరికొత్త అప్డేట్ను తెచ్చేందుకు సిద్ధమయింది. అదే మన వాట్సాప్ ఖాతాలో నిమిషం నిడివిగల వీడియో స్టేటస్‌ను పోస్ట్ చేయడం.
అయితే ప్రస్తుతానికి కేవలం గరిష్ఠంగా 30 సెకన్ల వరకు ఉన్న వీడియోను మాత్రమే వాట్సాప్‌లో పోస్ట్ చేసే అవకాశం ఉంది. అంతకంటే పెద్ద వీడియోలను అప్‌లోడ్ చేయాలంటే మరో స్టేటస్ అప్‌డేట్ తప్పదు. అలా వీడియో నిడివి పెరుగుతున్న కొద్దీ స్టేటస్ అప్‌డేట్ల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇక వాట్సాప్ తీసుకురానున్న ఈ నయా అప్డేట్తో ఈ ఇబ్బంది తప్పనుంది. రానున్న రోజుల్లో ఇక 60 సెకన్ల లిమిట్గల వీడియోలను మన వాట్సాప్ అకౌంట్లో స్టేటస్‌గా పోస్ట్ చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి వీరికి మాత్రమే
ఈ 1 మినిట్ నిడివిగల స్టేటస్ అప్డేట్ను వాట్సాప్ ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి కొంతమంది బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు WABETA వెల్లడించింది. బీటా వెర్షన్ 2.24.7.3 డౌన్‌లోడ్ చేసుకున్నవారికి ఈ ఫీచర్ దశలవారీగా అందుబాటులోకి వస్తోందని తెలిపింది. అంటే మిగిలిన యూజర్లందరికీ ఇది అందుబాటులోకి రానుంది.