WhatsApp New PIN Lock Feature : యూజర్ల ప్రైవసీని మరింతగా పెంచేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. ఇందులో భాగంగా వాట్సప్ ప్రొఫైల్‌ని స్క్రీన్ షాట్ తీసే సదుపాయాన్ని తొలగించిన సంస్థ, ఇప్పుడు మరొక ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీని ద్వారా మొబైల్ నంబర్‌తోనే పనిలేకుండా, కేవలం 'యూజర్ నేమ్'తో మెసేజ్ చేసే అవకాశం వస్తుంది.
పిన్ తప్పనిసరి
కొత్తగా పరిచయం అయిన ప్రతి ఒక్కరికి ఫోన్ నంబర్ ఇవ్వడానికి చాలా మంది సంకోచిస్తుంటారు. మొబైల్ నంబర్ ఇస్తే ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందో అని ఆలోచిస్తారు. ప్రస్తుతం వాట్సప్ తీసుకొస్తున్న 'యూజర్ నేమ్' ఫీచర్‌తో ఇకపై అలాంటి సమస్యలు ఉండవు. అంటే ఇకపై కొత్త వారితో సంభాషించాలంటే ఫోన్ నంబర్‌కు బదులు యూజర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. యూజర్ నేమ్ తెలిస్తే ఎవరైనా మెసేజ్ చేసే అవకాశం ఉంటుంది కదా అని అనుకుంటున్నారా? అలాంటి వాటికి అవకాశం లేదు. ఎందుకంటే మొదటిసారిగా ఆ వ్యక్తులతో మాట్లాడాలంటే 'యూజర్‌నేమ్'తో పాటు మీరు చెప్పే పిన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
పిన్‌ను క్రియేట్ చేసుకోవాలి
వాట్సప్ తీసుకొచ్చే ఈ కొత్త ఫీచర్‌లో యూజర్‌నేమ్‌తో పాటు నాలుదు అంకెల పిన్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే సంభాషిస్తున్న వ్యక్తులు ప్రత్యేకంగా పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. యూజర్ల భద్రతే లక్ష్యంగా, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లను కంట్రోల్ చేసేందుకే ఈ ఫీచర్‌ని తీసుకువస్తోంది వాట్సాప్. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, త్వరలోనే అందుబాటులోకి రానుందని వాట్సప్‌కు సంబంధించి అప్‌డేట్స్ అందించే 'వాబీటా ఇన్ఫో' తన బ్లాగ్‌లో వెల్లడించింది.