Whatsapp Translation Feature: ప్రముఖ ఇన్స్టంట్ మెసెజింగ్ యాప్ వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇప్పటికే తన వినియోగదారుల కోసం ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా 'ట్రాన్స్లేషన్ ఫీచర్'ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ సాయంతో ఇతర భాషల్లో వచ్చే మెసెజ్‌లను చాట్ బాక్స్‌లోనే మనకు కావాల్సిన భాషలో ట్రాన్స్‌లేట్ చేసుకుని చదువుకోవచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.26.9లో పరీక్షిస్తున్నట్లు వాబీటా ఇన్ఫో వెల్లడించింది. చాట్స్‌తో పాటు, వాట్సప్ ఛానెల్లోనూ ఈ సదుపాయం రాబోతోంది. ఈ ఫీచర్ ముఖ్యంగా వేర్వేరు వాట్సాప్ గ్రూప్‌లను ఉపయోగించే యూజర్లకు ఎక్కువగా ఉపయోగపడనున్నట్లు తెలుస్తోంది.
నిజానికి వేర్వేరు గ్రూపుల్లో ఉన్నవారికి ఎన్నో భాషల్లో మెసెజ్‌లు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఆ భాష రానివారు దాన్ని అర్థం చేసుకునేందుకు తెగ కష్టపడుతుంటారు. గ్రూప్‌లో వచ్చిన ఆ మెసెజ్ టెక్ట్స్‌ను కాపీ చేసి, వేరే ట్రాన్సలేషన్ టూల్లో వేసి చదువుతూ ఉంటారు. తద్వారా ఆ విషయంపై అవగాహన వచ్చాక రిప్లయ్ ఇస్తుంటారు. ఇన్ని తంటాలు పడకుండా సులువుగా చాట్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకునేందుకు వాట్సాప్ ఈ 'ట్రాన్స్‌లేట్ ఫీచర్'ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
ఈ ఫీచర్ పూర్తిగా మన వాట్సాప్లోనేపనిచేయనున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌లో సెక్యూరిటీ కోసం ఉండే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సైతం ఈ ట్రాన్స్‌లేషన్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక సాధారణ ట్రాన్స్లేషన్ టూల్స్‌లా క్లౌడ్ సర్వీస్‌కు పంపించాల్సిన అవసరం లేకుండా నేరుగా ట్రాన్స్లేషన్ చేసుకునే అవకాశం ఉంటున్నట్లు సమాచారం. ఫ్రీ డౌన్లోడెడ్ లాంగ్వేజీ ప్యాక్స్ ఆధారంగా ఈ ట్రాన్స్లేషన్ ఫీచర్ పనిచేస్తుంది. దీంతో ఈ ఫీచర్ సహాయంతో ఇకపై థర్డ్ పార్టీ సర్వర్లకు గానీ, వాట్సప్ సర్వర్లకు గానీ డేటాను షేర్ చేయాల్సిన అవసరం ఉండదు.