Ratan Tata Nano Car Project:ఇప్పటితరానికి నానో కారు గురించి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ రెండు దశాబ్దాల క్రితం అదో పెద్ద సంచలనం. టాటా గ్రూపు నుంచి కేవలం లక్ష రూపాయలకే కారు అనగానే అప్పటివరకు కారు కొనాలన్న ఊహే లేనివారి మదిలో సైతం ఆలోచన రేకెత్తించిన కారు ఇది. మధ్యతరగతి కోసం లక్ష రూపాయలకే కారు తీసుకొస్తామన్న రతన్ టాటా నుంచి ప్రకటన వచ్చింది మొదలు ఎన్నో సందేహాలు, మరెన్నో వివాదాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ రోడ్ల పైకి అడుగుపెట్టిందీ కారు. ఇచ్చినమాట కోసం నష్టాలకు సైతం సిద్ధమయ్యారు రతన్ టాటా!!
మధ్యతరగతి కోసం కారు:దేశంలోకార్లు అంటే సంపన్న వర్గాలకే అనుకునే రోజులవి. మధ్యతరగతి కుటుంబాలకు ద్విచక్ర వాహనాలే దిక్కు. భర్త స్కూటర్ నడుపుతుంటే భార్య, పిల్లలు వెనక సీట్లో కూర్చునేవారు. ఓ రోజు ఆయన కారులో వెళ్తుండగా వర్షంలో ఓ స్కూటర్ మీద దంపతులు తమ పిల్లలతో ఇబ్బంది పడుతూ వెళ్తున్న సంఘటన చూశారట. ఆ ప్రయాణంలో తల్లిదండ్రుల మధ్య నలిగిపోతున్న పిల్లల్ని చూసి చలించిన రతన్ టాటా మధ్యతరగతి వారి కోసం ఓ చౌకైన కారును తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్లకే తన మనసులో మాటను బయటపెట్టారు. అంతేకాదు దాన్ని కేవలం లక్ష రూపాయలకే అందిస్తామని ప్రకటించారు. అలా నానో కారుకు బీజం పడింది.
సందేహాలు.. వివాదాలు:టాటా గ్రూపు నుంచి నానో కారుపై ప్రకటన వెలువడింది మొదలు సందేహాలు, వివాదాలు అన్నీఇన్నీ కావు. 'అదంతా అయ్యే పని కాదు' అంటూ చాలామంది పెదవి విరిచారు. మొదట్లో ఈ కారును బంగాల్‌లో తయారు చేయాలనుకున్నారు. అయితే అప్పట్లో టాటా గ్రూపునకు, అక్కడి వామపక్ష గవర్నమెంట్ జరిపిన భూ కేటాయింపులకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఉద్యమం నడిపారు.
దీంతో ఈ ప్రాజెక్ట్ గుజరాత్‌కు తరలించాల్సి వచ్చింది. ఈ లక్ష రూపాయల కార్లు ఎడాపెడా రోడ్డు మీదకు వస్తే పర్యావరణం దెబ్బతింటుందన్న పర్యావరణవేత్తల ఆందోళనలూ చుట్టుముట్టాయి. కారు పనితీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీకి ఎన్నికల్లో సహకరించేందుకే రతన్ టాటా నానో కారును ఆగమేఘాల మీద తీసుకొచ్చారన్న అపవాదునూ ఎదుర్కొన్నారు.