Vivo Upcoming Mobiles 2025:ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో భారతదేశంలో కొన్ని కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం ఫిబ్రవరిలో కంపెనీ వివో V50 మొబైల్‌ను భారత్‌లో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త నివేదిక వివో అప్‌కమింగ్ స్మార్ట్ఫోన్లపై సమాచారం అందించింది. దీని ప్రకారం కంపెనీ త్వరలో మన దేశీయ మార్కెట్లో వివో T4x 5G, వివో Y59 5G మోడల్స్‌ను కూడా ప్రారంభించనుంది. ఈ రెండు ఫోన్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) డేటాబేస్‌లో గుర్తించారు.
వివో నుంచి మరో రెండు కొత్త ఫోన్లు: మై స్మార్ట్ ప్రైస్ నివేదిక ప్రకారం BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో V2437, V2443 మోడల్ నంబర్‌లతో రెండు కొత్త ఫోన్‌లు కనిపించాయి. ఈ నంబర్లు వరుసగా వివో T4x 5G, వివో Y59 5G స్మార్ట్ఫోన్లవే అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ రెండు ఫోన్‌లను త్వరలోనే భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు BIS లిస్టింగ్ సూచిస్తుంది. అయితే ఈ లిస్టింగ్‌లో ఫోన్ వివరాల గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు.
వీటిలో వివో T4x 5G స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది ఏప్రిల్‌లో లాంఛ్ అయిన వివో T3x 5G ఫోన్‌కు సక్సెసర్‌గా ప్రారంభించొచ్చు. ఈ వివో T3x 5G ఫోన్‌లో ప్రాసెసర్ కోసం స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoC చిప్‌సెట్‌ను అందించారు. ఈ ఫోన్ 6.72-అంగుళాల 120Hz HD LCD స్క్రీన్, 6000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP+2MP వెనుక కెమెరా సెటప్, 8MP ఫ్రంట్ కెమెరాతో అందుబాటులో ఉంది. ఇక ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Funtouch OS 14 సపోర్ట్‌తో వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ సక్సెర్గా రాబోతున్న వివో T4x 5Gలో ఎలాంటి స్పెసిఫికేషన్లు ఉంటాయో ఊహించొచ్చు.
ఇక వివో Y59 5G మొబైల్‌ను కూడా గతేడాది జూన్ 2024లో ప్రారంభించిన వివో Y58 5Gకి సక్సెసర్‌గా తీసుకురావచ్చు. వివో Y58 5Gని కంపెనీ 6.72-అంగుళాల ఫుల్ HD ప్లస్ LCD స్క్రీన్‌తో పాటు వివో T3x 5Gలో ఇచ్చిన అదే స్పెసిఫికేషన్‌లతో ప్రారంభించింది. అయితే ఈ Y58 5G ఫోన్‌లో ప్రాసెసర్ కోసం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. అటువంటి పరిస్థితిలో ఈ ఫోన్‌కు సక్సెసర్‌గా వస్తున్న వివో Y59 5Gలో కూడా ఏ స్పెసిఫికేషన్లు ఉండనున్నాయో ఒక అంచనాకి రావచ్చు.