తెలంగాణ

telangana

ETV Bharat / technology

పాస్​వర్డ్స్​ గుర్తుంచుకోవడం కష్టంగా ఉందా? ఓ 'మేనేజర్​'ను పెట్టుకోండిలా! - Password Manager Security Benefits - PASSWORD MANAGER SECURITY BENEFITS

Password Manager Security Benefits : ఆన్​లైన్ భద్రత అనగానే ముందుగా గుర్తొచ్చేది పాస్​వర్డ్. అది స్ట్రాంగ్​గా ఉంటే ఖాతాలను సైబర్‌ నేరగాళ్లు అంత ఈజీగా హ్యాక్‌ చేయలేరనేది నిపుణులు చెబుతున్నమాట. అయితే మనకున్న అకౌంట్​లన్నింటికీ పాస్​వర్డ్ స్ట్రాంగ్​గా పెట్టడం ఆషామాషీ కాదు. ఒకవేళ పెట్టినా వాటిని గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఇందుకు పాస్​వర్డ్ మేనేజర్ బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే?

free password manager for android
Best password manager of 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 8:33 PM IST

Password Manager Security Benefits :బ్యాంకు లావాదేవీలైనా, నగదు చెల్లింపులైనా, కొనుగోళ్లయినా అన్నీ ఉన్న చోటు నుంచే ఆన్​లైన్​లో కానిచ్చేస్తున్నాం. వీటి లాగిన్‌ సమాచారం ఇతరులు యాక్సెస్‌ చేయకుండా యూజర్‌ నేమ్‌, పాస్​వర్డ్‌ ఏర్పాటు చేస్తున్నాం. మరోవైపు యూజర్‌ డేటా కోసం సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. వీటి బారి నుంచి కాపాడుకునేందుకు చాలా మంది పాస్​వర్డ్‌ మేనేజర్లను వినియోగిస్తుంటారు. దీంతో అన్ని ఖాతాలపాస్​వర్డ్​లు, యూజర్‌ నేమ్​లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే చోట వాటిని భద్రపరచుకోవచ్చు. అసలేంటీ ఈ పాస్​వర్డ్ మేనేజర్? యూజర్స్​కు ఎలా ఉపయోగపడుతుంది? తదితర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ-మెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై వంటి వాటికి కూడాపాస్​వర్డ్​లు పెట్టుకుంటాం. ఇవే కాక ఇంకా చాలా వాటికి పాస్​వర్డ్స్​ క్రియేట్ చేసి గుర్తుంచుకుంటాం. అయితే సింపుల్ పాస్​వర్డ్స్ పెడితే, సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే పాస్​వర్డ్ మేనేజర్​ను వాడుకోవాలి. దీనికి ఒక స్ట్రాంగ్ పాస్​వర్డ్​ను పెట్టుకుంటే చాలు. మిగతా పాస్​వర్డ్​లను గుర్తించుకోనక్కర్లేదు. పైగా అవి భద్రంగా ఉంటాయి.

పాస్​వర్డ్ మేనేజర్​ను ఎందుకు ఉపయోగించాలి?
ప్రస్తుత కాలంలో చాలా మంది తమ ఆన్​లైన్ ఖాతాలన్నింటికీ ఒకే పాస్​వర్డ్​ను పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల సైబర్ దాడికి గురైతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎలా అంటే, మీ అన్ని అకౌంట్లలోని డేటా, నగదు చోరీ అవుతుంది. చాలా మంది తమ పుట్టిన తేదీ, కుటుంబ సభ్యుల పేర్లు, ఇష్టమైన క్రీడా జట్లు లేదా abc123 వంటి సాధారణ పాస్​వర్డ్స్ పెడుతుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. సైబర్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే కచ్చితంగా స్ట్రాంగ్ పాస్​వర్డ్ పెట్టుకోవాలి. అందుకే ఈ-మెయిల్, సోషల్ మీడియా, యూపీఐ ఖాతాలకు వేర్వేరు పాస్​వర్డ్​ను పెట్టుకోవడం ఉత్తమం. అయితే వేర్వేరు పాస్​వర్డ్​లను గుర్తుంచుకోవడం కష్టం అయితే అప్పుడు పాస్​వర్డ్ మేనేజర్​ను ఉపయోగించుకోవడం మంచిది.

పాస్​వర్డ్ మేనేజర్ ఎలా పని చేస్తుంది?
పాస్​వర్డ్ మేనేజర్ యాప్స్ మీ పాస్​వర్డ్స్​ను డిజిటల్ వాల్ట్​లో సురక్షితంగా ఉంచుతాయి. మీరు మీ ఈ-మెయిల్, సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేయాలనుకున్నప్పుడు లాగిన్, పాస్​వర్డ్ ఫీల్డ్​లను ఇవి ఆటో ఫిల్ చేస్తాయి. పాస్‌వర్డ్ మేనేజర్​లు ఫిషింగ్ స్కామ్​ల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతాయి. సైబర్ మోసాలకు గురికాకుండా మిమ్మల్ని రక్షిస్తాయి. 1పాస్​వర్డ్, బిట్​వార్డెన్, డాష్​లేన్, బిట్‌ డెఫెండర్, నార్డ్‌ పాస్, కీపర్, కీపాస్ వంటి చాలా పాస్​వర్డ్ మేనేజర్ యాప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు.

పాస్​వర్డ్ మేనేజర్స్​ను హ్యాక్ చేయలేరా?
కొన్నాళ్ల క్రితం 'లాస్ట్​పాస్' అనే పాస్ట్​వర్డ్ మేనేజర్ సైబర్ దాడికి గురైంది. దీంతో ఒక్కసారిగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో సైబర్ నిపుణులు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. పాస్​వర్డ్ మేనేజర్స్ అనేవి చాలా వరకు సురక్షితంగా ఉంటాయి. AES-256 ఎన్​క్రిప్షన్‌ ఉన్న పాస్​వర్డ్ మేనేజర్స్​ను ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయలేరు. ఒక వేళ పాస్​వర్డ్ మేనేజర్​ను ఎవరైనా క్రాక్ చేసినా, వాటిలోని మిగతా పాస్​వర్డ్స్​ను ఎన్​కోడ్, డీకోడ్ చేయడం చాలా కష్టమని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రధానంగా తరచూ సెక్యూరిటీ ఆడిట్స్ చేసే పాస్​వర్డ్ మేనేజర్స్​ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. పాస్​వర్డ్ మేనేజర్స్ సాధారణంగా డేటాను క్లౌడ్​లో స్టోర్ చేస్తుంటాయి. కనుక భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉంది. కనుక మీ సొంత డివైజ్​ (ల్యాప్​టాప్, పీసీ, ట్యాబ్లెట్)లోనే మీ వివరాలు స్టోర్ చేసుకునే వెసులుబాటు కల్పించే పాస్​వర్డ్ మేనేజర్లను ఎంచుకోవాలి.

ఆ 35 మోడల్ ఫోన్స్​లో వాట్సాప్ బంద్​- ఒకసారి లిస్ట్​ చెక్​ చేసుకోండి మరి! - Whatsapp Stop Working Phones

ఇట్స్ అమేజింగ్ : ఇక ఏ దొంగా మీ ఇంట్లోకి వెళ్లలేడు - మార్కెట్లోకి ఫింగర్ ​ప్రింట్​ తాళాలు వచ్చేశాయ్! - Best Fingerprint Padlocks

ABOUT THE AUTHOR

...view details