Sun To Earth Light Time : సూర్యుడి నుంచి కాంతి భూమిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? అని ప్రశ్న వేస్తే కచ్చితంగా 8 నిమిషాల 20 సెకన్లు అని సమాధానం చెబుతాం. కానీ సూర్యుడి నుంచి కాంతి భూమికి చేరుకోవడానికి పట్టే కచ్చితమైన సమయం ఇది కాదట. అదేంటో ఓ సారి తెలుసుకుందాం.
సూర్యుడు, భూమికి మధ్య దూరం సుమారు 150 మిలియన్ కిలోమీటర్లు. ఈ లెక్కను బట్టి సూర్యుడి నుంచి కాంతి భూమికి చేరుకోవడానికి 500 సెకన్లు లేదా ఎనిమిది నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుంది. అయితే సూర్యుని చుట్టూ భూకక్ష్య సంపూర్ణ వృత్తాకారంలో కాకుండా కొద్దిగా దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది. కాబట్టి భూమి, సూర్యుడికి మధ్య అసలు దూరం దాదాపు 147-152 మిలియన్ కిలోమీటర్ల వరకు ఉంటుంది. కాబట్టి సూర్యుని నుంచి భూమికి కాంతి వాస్తవ ప్రయాణ సమయం 490 నుంచి 507 సెకన్ల వరకు ఉండొచ్చు లేదా 8 నిమిషాల 10 సెకన్ల నుంచి 8 నిమిషాల 27 సెకన్ల వరకు ఉండవచ్చు. కాంతి ఫోటాన్‌లు, సూర్యుని ఉపరితలం వద్ద ఏర్పడలేదు. అవి నక్షత్రం లోపల లోతుగా ఉన్నాయి. అవి భూమికి చేరుకోవడానికి ప్రయాణాన్ని ప్రారంభించే ముందు సూర్యుని ఉపరితలం చేరుకోవడానికి వేల ఏళ్లు పట్టవచ్చు.