Bharat Mobility Global Expo 2025:భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈరోజు ప్రారంభం అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్ ఫెయిర్ ఈవెంట్‌ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి పీఎంతో పాటు పలువురు కేంద్ర మంత్రులు.. నితిన్ గడ్కరీ, హెచ్‌డి కుమారస్వామి, జితన్ రామ్ మాంఝీ, మనోహర్ లాల్, పియూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరి హాజరయ్యారు.
ప్రగతి మైదాన్, ద్వారక, గ్రేటర్ నోయిడా అనే మూడు ప్రదేశాలలో 5 రోజుల పాటు ఈ కార్ ఫెయిర్ జరగనుంది. ఇండియా ఎక్స్‌పో సెంటర్ అండ్ మార్ట్‌లో నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్‌లో భారతదేశంతో సహా వివిధ దేశాల నుంచి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ ఆటో ఎగ్జిబిషన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలతో సహా 100 కి పైగా కొత్త వాహనాలు ప్రదర్శించనున్నట్లు సమాచారం. పీఎం చేతుల మీదుగా ఇవాళ ఘనంగా ప్రారంభమైన ఈ కార్ ఫెయిర్ జనవరి 22 వరకు కొనసాగనుంది.
ఈ ఈవెంట్‌లో మొదటి రోజు మీడియా కవరేజ్ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. రెండవ రోజును డీలర్లకు ప్రత్యేకంగా కేటాయించారు. ఈ క్రమంలో జనవరి 19 నుంచి సాధారణ వ్యక్తులు ఈ కార్ మేళాలో పాల్గొనవచ్చు. ఈ కార్ ఫెయిర్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ ఫెయిర్‌లో పాల్గొనేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఫెయిర్‌కి ప్రవేశం పూర్తిగా ఉచితం. అయితే ఇందుకోసం మీరు http://www.bharat-mobility.com వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
పాల్గొంటున్న అన్ని కంపెనీలు:హీరో మోటోకార్ప్, సుజుకి, మోటార్ సైకిల్ ఇండియా వంటి కంపెనీలు బైక్స్ అండ్ స్కూటీలను తయారు చేస్తాయి. ఈ సంస్థలన్నీ కూడా ఈ కార్ ఫెయిర్‌లో పాల్గొంటున్నాయి. వీటితో పాటు మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, కియా ఇండియా, ఎంజి మోటార్ ఇండియా, స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియా వంటి బ్రాండ్లు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. ఈ కంపెనీలు తమ వివిధ కార్ల కొత్త, అత్యాధునిక మోడళ్లను ఈ కార్ ఫెయిర్‌లో ప్రదర్శిస్తాయి.
లగ్జరీ కార్ల కేటగిరీ:ఈ కార్ల ప్రదర్శనలో మెర్సిడెస్-బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, పోర్స్చే ఇండియా వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి లగ్జరీ వాహనాలు ప్రదర్శించనున్నారు. అదే సమయంలో వాణిజ్య వాహనాల విభాగంలో టాటా మోటార్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ కూడా ఉంటాయి.