Open AI Sora Videos :ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త విప్లవం సృష్టించిన ఓపెన్ ఏఐ సంస్థ, టెక్స్ట్-టు-వీడియో జనరేషన్ మోడల్ SORAను పరిచయం చేసింది. దీని ద్వారా మీరు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వీడియోను సృష్టించవచ్చు. ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పటికే చాట్ జీపీటీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ప్రస్తుతం ఈ సోరా ద్వారా మల్టీ మీడియా రంగంలో కూడా సరికొత్త విప్లవం సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సోరా ద్వారా 60 సెకన్ల వరకు మనం వీడియోలను సృష్టించవచ్చు. కేవలం టెక్స్ట్ కమాండ్స్ ఉపయోగించి నిమిషం నిడివి గల వీడియోను రూపొందించవచ్చు. సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ కొత్త ఏఐ జనరేటర్ గురించి మాట్లాడుకుంటున్నారు. మరి Open AI Sora అంటే ఏమిటి ? ఎలా ఉపయోగించాలి? అందరికీ అందుబాటులోకి వచ్చిందా? సేఫేనా? వంటి వివరాలు చూద్దాం పదండి.
Open AI Sora అంటే ఏమిటి?
ఓపెన్ ఏఐ సంస్థ ఈ సోరా ప్లాట్ ఫామ్‌ను సృష్టించింది. ఇది తమ యూజర్లకు టెక్స్ట్ ప్రాంప్ట్‌ల ఆధారంగా హై క్వాలిటీ కలిగిన ఒక నిమిషం వీడియోలను రూపొందిస్తుంది. యూజర్లు ప్రాంప్ట్ ద్వారా రాసిన వివరాలకు దగ్గరగా సరిపోలే వీడియోలను జనరేట్ చేస్తుంది. కెమెరా మోషన్లతో సహా వివిధ క్యారెక్టర్లను కూడా ఇది రూపొందిస్తుంది. గూగుల్ లూమియర్, రన్‌వే ఏఐ, పికా 1.0 వంటివి ఇప్పటికే టెక్ట్స్-టు-వీడియో జనరేటర్లను తీసుకొచ్చాయి. అయితే, ఇవేవీ 5 సెకన్లకు మించి వీడియోలను జనరేట్ చేయలేవు. వాటితో పోలిస్తే ఓపెన్ఏఐ తీసుకొచ్చిన జనరేటర్ దాదాపు 10 రెట్లు అధిక నిడివి కలిగిన వీడియోను జనరేట్ చేస్తుండడం గమనార్హం.
ఈ వీడియో జనరేషన్ యాప్ ఎలా ఉపయోగించాలి ?
సోరా ద్వారా మీరు ఊహించిన వీడియోకు సంబంధించిన వివరాలను టెక్స్ట్ రూపంలో రాసి ఇన్పుట్ ఇవ్వాలి. మీరు ప్రాంప్ట్ చేసిన కమాండ్లకు అనుగుణంగా వీడియో క్లిప్ గా సోరా మారుస్తుంది. అదనంగా మీరు దీన్ని వీడియోగా మార్చడానికి మరింత వివరంగా ప్రాంప్ట్ కమాండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే రూపొందించిన వీడియోల లెంగ్త్‌ను కూడా పెంచగలదు.
అందరికీ అందుబాటులోకి వచ్చిందా?
ఓపెన్ ఏఈ ఈ సోరాను పబ్లిక్ రిలీజ్ కోసం టైమ్‌లైన్‌ను ప్రకటించలేదు. సెక్యూరిటీ ఫీచర్లను టెస్టింగ్ చేసిన తర్వాత ఈ యాప్‌ను అందుబాటులోకి తేవాలని సంస్థ భావిస్తోంది. ఎందుకంటే ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ ఫీచర్లను రూపొందించాలని కూడా కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా కంటెంట్ విషయంలో దుర్వినియోగం కాకుండా రూపొందించాలని ఓపెన్ ఏఐ భావిస్తోంది.
ఎవరు ఉపయోగించగలరు?
ఈ యాప్ పనితీరును అంచనా వేయడానికి రెడ్ టీమర్లకు (సైబర్ సెక్యూరిటీ నిపుణులు) సోరాను అందుబాటులోకి తెస్తామని చెబుతోంది ఓపెన్ ఏఐ సంస్థ. రెడ్ టీమర్లతోపాటు, విజువల్ ఆర్టిస్టులు, ఫిల్మ్‌మేకర్లకు కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తేనుంది. అయితే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని టెక్నికల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.