తెలంగాణ

telangana

ETV Bharat / technology

సూర్యుని చెంతకు మానవ అస్త్రం- చరిత్ర సృష్టించిన 'పార్కర్ సోలార్ ప్రోబ్' - PARKER SOLAR PROBE MISSION

సూర్యుని ముంగిట చక్కర్లు- అత్యంత సమీపంగా వెళ్లొచ్చి రికార్డ్

Parker Solar Probe Spacecraft
Parker Solar Probe Spacecraft (Photo Credit: NASA)

By ETV Bharat Tech Team

Published : Dec 29, 2024, 5:16 PM IST

Parker Solar Probe: నాసాకు చెందిన 'పార్కర్ సోలార్ ప్రోబ్' సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాక సూర్యుని చెంతకు వెళ్లినా కూడా ఈ స్పేస్​క్రాఫ్ట్​కు ఏం కాలేదని, ప్రస్తుతం ఇది సురక్షితంగా ఉండి ఎప్పటిలాగనే పనిచేస్తోందని అమెరికా అంతరిక్ష సంస్థ వెల్లడించింది. ఈ అంతరిక్ష నౌక డిసెంబర్ 24న సూర్యుని ఉపరితలానికి 3.8 మిలియన్ మైళ్లు (6.1 మిలియన్ కిలోమీటర్లు) దూరంలోకి వెళ్లొచ్చినట్లు ప్రకటించింది.

సూర్యుడి బాహ్య వాతావరణంగా పిలిచే కరోనాపై పరిశోధన కోసం ఈ మిషన్ ప్రయోగించారు. సూర్యుడి వేడి వాతావరణంలో చాలా రోజుల పాటు ప్రయాణించిన తర్వాత ఈ స్పేస్​క్రాఫ్ట్​ నాసాతో సంబంధాన్ని కోల్పోయింది. దీంతో ఇది సూర్యుడి వేడిలో డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుందేమో అని శాస్త్రవేత్తలు భయపడటం మొదలు పెట్టారు. దీని సిగ్నల్​ కోసం అంతా ఆశగా ఎదురుచూశారు. ఈ క్రమంలో 'పార్కర్ సోలార్ ప్రోబ్' సిగ్నల్ కోసం శుక్రవారం వరకూ వేచి చూడాలని భావించారు.

'పార్కర్ సోలార్ ప్రోబ్' నుంచి డిసెంబర్ 28 ఉదయం 5 గంటలకు మొదటి సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందుగానే గురువారం రాత్రే ఈ స్పేస్​క్రాఫ్ట్ ​నుంచి సంకేతాలు వచ్చాయి. దీంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేవు. ఈ మేరకు మండుతున్న సౌర జ్వాలల మధ్య ఉద్భవించినట్లుగా ఈ అంతరిక్ష నౌక బయటకు వచ్చినట్లు నాసా శుక్రవారం ప్రకటించింది. సూర్యుని బయటి వాతావరణం దాని ఉపరితలం కంటే వందల రెట్లు వేడిగా ఎందుకు ఉందో, సౌర గాలి నిరంతరం సూర్యుని నుంచి దూరంగా కదిలే చార్జ్డ్ కణాలను ఎలా నడిపిస్తుందో అర్థం చేసుకునేందుకు ఇది అందించే డేటా సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కరోనాలోకి ప్రవేశించిన పార్కర్ సోలార్ ప్రోబ్: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్పేస్‌క్రాఫ్ట్ క్రిస్మస్‌కు ఒక రోజు ముందు సూర్యుని బాహ్య వాతావరణం కరోనాలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకూ ఇంత దూరాన్ని ఏ అంతరిక్ష నౌక కూడా చేరుకోలేకపోయింది. ఈ స్పేస్​క్రాఫ్ట్​ మాత్రం తీవ్రమైన ఉష్ణోగ్రతలు, రేడియేషన్ ఉన్నప్పటికీ అక్కడ మనుగడ సాగించగలిగింది. ప్రస్తుతం ఈ 'సోలార్ ప్రోబ్' సూర్యుడి వేడి వాతావరణం నుంచి బయటపడి పూర్తిగా సురక్షితంగా ఉందని మేరీలాండ్‌లోని జాన్‌ హాప్కిన్స్‌ అప్లైడ్‌ ఫిజిక్స్‌ లేబోరేటరీ వెల్లడించింది. ఈ స్పేస్​క్రాఫ్ట్ తన పొజిషన్​ గురించి వివరణాత్మక టెలిమెట్రీ డేటాను జనవరి 1న పంపుతుందని తెలిపింది.

ఇది మానవులు నిర్మించిన అత్యంత వేగవంతమైన స్పేస్​ క్రాఫ్ట్. దీన్ని నాసాతో పాటు పలు ఇతర పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించారు. 'పార్కర్ సోలార్ ప్రోబ్' 1,800 డిగ్రీల ఫారెన్‌హీట్ (982 డిగ్రీల సెల్సియస్) వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. అత్యధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునేలా దీని చుట్టూ పటిష్ఠ కవచం ఉంటుంది. నమూనాల సేకరణకు ఉపయోగించేందుకు బిగించిన కప్‌, మరో డివైజ్ మాత్రం కవచం బయట ఉంటాయి. అవి కరిగిపోకుండా టంగ్‌స్టన్‌, మాలిబ్డినమ్‌, నియోబియం, సఫైర్‌ వంటి పదార్థాలతో వీటిని తయారుచేశారు.

కరోనా పొరపై ఏడేళ్లపాటు పరిశోధనలు జరపడమే ప్రధాన లక్ష్యంగా 2018లో నాసా ఈ మిషన్ ప్రయోగించింది. ఈ స్పేస్​క్రాఫ్ట్ 2021 ఏప్రిల్‌ 28న తొలిసారి సూర్యుడి బాహ్య వాతారణం కరోనాలోకి ప్రవేశించింది. ఇది అందించే సమాచారం సూర్యుని కరోనాలో ఏదైనా వస్తువు ఎలా మిలియన్ల డిగ్రీల సెల్సియస్‌ వేడికి చేరుతుందో తెలుపుతుంది. సూర్యుడి నుంచి వచ్చే గాలులు ఎందుకు చాలా వేడిగా ఉంటాయి? వాటి నుంచి వేడి ఎలా ఎస్కేప్ అవుతుంది? అనే వివరాలను తెలుసుకునే దానిపై ఇది ఒక అధ్యయనం.

'విశ్వంలో డార్క్ ఎనర్జీ అనేదే లేదు- ఆ సిద్ధాంతాలు తప్పు'- వీడిన అతిపెద్ద మిస్టరీ!

తిప్పరా మీసం.. భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు సర్వం సిద్ధం!

ఎన్నో రహస్యాలు.. ఛేదించే పనిలో 'ప్రోబా-3'.. ఇది కృత్రిమ సూర్యగ్రహణాన్ని ఎలా సృష్టిస్తుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details