Jio Launches JioTele OS: రిలయన్స్ జియో స్మార్ట్ టీవీ కోసం దేశంలో మొట్టమొదటి ఆపరేటింగ్ సిస్టమ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 'జియోటెలి ఓఎస్ (JioTele OS)' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ టీవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీరుస్తుందని కంపెనీ తెలిపింది. స్మార్ట్‌టీవీ కంటెంట్‌ను మరింత మందికి చేరువ చేయడం, ప్రాంతీయ కంటెంట్‌ను అందించడమే ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ముఖ్య ఉద్దేశం అని చెబుతోంది.
దీంతోపాటు ఇది టీవీ OEMలు సరసమైన ధరలకు వరల్డ్-క్లాస్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి వీలు కల్పిస్తుందని జియో అంటోంది. దీన్ని "ఇండియా ఓన్ స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్" అని పిలుస్తోంది. అంతేకాక దీన్ని నెక్స్ట్-జనరేషన్ ప్లాట్‌ఫారమ్‌గా పేర్కొంటూ భారతీయ వినియోగదారుల ప్రత్యేక అవసరాల కోసం ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించినట్లు తెలిపింది.
తమ కొత్త 'జియోటెలి OS' Google TV, LG's webOS, Samsungs Tizen ప్లాట్‌ఫామ్‌లకు పోటీగా నిలుస్తుందని కంపెనీ అంటోంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి రానుంది. 'జియోటెలి OS'తో నడిచే టెలివిజన్లు ఫిబ్రవరి 21, 2025 నుంచి థామ్సన్, కోడాక్, BPL, JVC వంటి బ్రాండ్ల నుంచి అందుబాటులోకి రానున్నాయని, ఈ ఏడాది చివర్లో మరిన్ని బ్రాండ్లు ఈ లైనప్‌లో చేరతాయని జియో చెబుతోంది.
భారతదేశంలో డిజిటల్ వినోదానికి డిమాండ్ నిరంతరం పెరుగుతోందని, ఈ క్రమంలో దేశంలో ఇప్పటికే 35 మిలియన్ల TV హౌస్‌హోల్డ్స్ కనెక్ట్ అయ్యాయని జియో తెలిపింది. టెలివిజన్ల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించడం వెనక గల కారణాన్ని వివరిస్తూ, చాలామంది వినియోగదారులు తమ కనెక్టెడ్ టీవీల లిమిటెడ్ కేపబిలిటీల కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారని కంపెనీ తెలిపింది.