ISRO Sucessfully Docks Satellites:స్పేడెక్స్ ప్రయోగ విజయంతో 2024కు ఘనమైన ముగింపు పలికిన ఇస్రో ఈ ఏడాది ప్రారంభంంలోనే మరోసారి చరిత్ర సృష్టించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా వ్యామనౌకల అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విజయంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది.
చారిత్రాత్మక విజయంపై ఆనందాన్ని పంచుకున్న ఇస్రో: ఈ మేరకు రోదసిలో ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా పంచుకుంది. అంతరిక్ష చరిత్రలో భారత్ తన పేరును లిఖించుకుందని, ఈ చారిత్రాత్మక క్షణాన్ని చూసినందుకు చాలా గర్వంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేసింది.
ప్రధాని మోదీ హర్షం:స్పేడెక్స్ మిషల్లో ఉపగ్రహాల డాకింగ్ విజయవంతంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. రోదసిలో రెండు శాటిలైట్లను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక బృందానికి అభినందనలు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఇది ఒక కీలక మెట్టుగా నిలిచిందని పేర్కొన్నారు.
ఇస్రో స్పేడెక్స్ ప్రయోగం:కాగా ఇస్రో 30 డిసెంబర్ 2024న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్‌లో శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు.
PSLV-C60 ఈ శాటిలైట్లను విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ స్పేడెక్స్ మిషన్ ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) రెండు ఉపగ్రహాలు రోదసిలో డాకింగ్, అన్‌డాకింగ్ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా వృత్తాకార కక్ష్యలో ఈ జత ఉపగ్రహాలను ఏకకాలంలో డాకింగ్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
రెండుసార్లు వాయిదా:ఇస్రో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ జనవరి 7న జరగాల్సి ఉంది. అయితే ఈ మిషన్‌లో సాంకేతిక కారణాలు తలెత్తడంతో డాకింగ్ ప్రక్రియపై మరికొంత పరిశోధన అవసరమని పేర్కొంటూ ఈ షెడ్యూల్‌ను జనవరి 9కి మార్చినట్లు మొదట ఇస్రో ప్రకటించింది.
ఆ తర్వాత కూడా ఇస్రో స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియను మరోసారి వాయిదా వేసింది. ఇస్రో రీషెడ్యూల్ చేసిన ప్రణాళిక ప్రకారం ఈ ప్రాసెస్ జనవరి 9, 2025 ఉదయం 8:00 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఉపగ్రహాల మధ్య దూరం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటంతో ఈ ప్రయోగాన్ని మరోసారి వాయిదా వేసినట్లు ఇస్రో ప్రకటించింది.
ఇస్రో రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 500 మీటర్ల నుంచి 225 మీటర్లకు చేర్చేందుకు ఓ విన్యాసం నిర్వహించింది. అయితే ఈ రెండు శాటిలైట్ల మధ్య దూరం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటాన్ని గుర్తించడంతో మరోసారి పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చిందని పేర్కొంటూ ఇస్రో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. దీంతోపాటు ప్రస్తుతం ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నాయని వెల్లడించింది. అయితే రెండోసారి వాయిదా వేసిన సమయంలో మాత్రం ఇస్రో డాకింగ్ ప్రక్రియ రీషెడ్యూల్ తేదీని వెల్లడించలేదు.
ఆదివారం అప్డేట్:రెండుసార్లు వాయిదా వేసిన అనంతరం ఇస్రో ఆదివారం అంటే జనవరి 12వ తేదీని దీనిపై ఓ అప్డేట్ అందించింది. రెండు స్పేడెక్స్ శాటిలైట్లు మరింత దగ్గరయ్యాయని వెల్లడించింది. శనివారం (జనవరి 11) వాటి మధ్య దూరం 230 మీటర్లుగా ఉండగా, ఆదివారం నాటికి ఆ దూరం మొదట 15 మీటర్లకు చేరుకుందని తెలిపింది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఆ రెండు శాటిలైట్లను 3 మీటర్ల దగ్గరకు తీసుకువచ్చి అక్కడ వాటిని హోల్డ్ చేశారు. ఈ డేటాను పూర్తిగా విశ్లేషించిన తరువాత డాకింగ్ ప్రక్రియ చేపడతామని ఇస్రో తెలిపింది.
ప్రస్తుతానికి శాటిలైట్లలోని అన్ని వ్యవస్థలూ సక్రమంగానే పనిచేస్తున్నాయని, అన్ని సెన్సర్ల పనితీరును విశ్లేషిస్తున్నామని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఈ క్రమంలో అనుకున్నట్లుగానే భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ అనుసంధాన ప్రక్రియను విజయవంతగా పూర్తి చేసినట్లు ఇస్రో గురువారం ట్వీట్ పంచుకుంది.