ISRO Postpones Spadex Docking Again:భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. ఇస్రో ఇటీవల రీషెడ్యూల్ చేసిన ప్రణాళిక ప్రకారం.. ఈ ప్రాసెస్ ఈరోజు (జనవరి 9, 2025) ఉదయం 8:00 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఉపగ్రహాల మధ్య దూరం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటంతో ఈ ప్రయోగాన్ని మరోసారి వాయిదా వేసినట్లు ఇస్రో ప్రకటించింది.
ఇస్రో రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 500 మీటర్ల నుంచి 225 మీటర్లకు చేర్చేందుకు ఓ విన్యాసం నిర్వహించింది. అయితే ఈ రెండు శాటిలైట్ల మధ్య దూరం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటాన్ని గుర్తించడంతో మరోసారి పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చిందని పేర్కొంటూ ఇస్రో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. దీంతోపాటు ప్రస్తుతం ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నాయని వెల్లడించింది. అయితే ఈ డాకింగ్ ప్రక్రియ రీషెడ్యూల్ తేదీని మాత్రం ఇస్రో వెల్లడించలేదు.
ఇదిలా ఉండగా మొదట స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా డాకింగ్ ప్రక్రియను జనవరి 7న నిర్వహించేందుకు ఇస్రో ప్లాన్ చేసింది. అయితే ఈ మిషన్‌లో కొన్ని సాంకేతిక కారణాలు తలెత్తడంతో షెడ్యూల్‌ను జనవరి 9కి మార్చింది. ఇవాళ ఈ ప్రాసెస్ జరగాల్సి ఉండగా ప్రస్తుతం ఉపగ్రహాల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది.
కాగా ఇస్రో 30 డిసెంబర్ 2024న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్‌లో శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ శాటిలైట్లను PSLV-C60 విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఈ స్పేడెక్స్ మిషన్ ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) రెండు ఉపగ్రహాలు రోదసిలో డాకింగ్, అన్‌డాకింగ్ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా వృత్తాకార కక్ష్యలో ఈ జత ఉపగ్రహాలను ఏకకాలంలో డాకింగ్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ అనుసంధాన ప్రక్రియ జరగనుంది.
స్పేడెక్స్ మిషన్ భవిష్యత్ ప్రయోగాలకు ఎలా ఉపయోగపడుతుందంటే?:అంతరిక్షంలో పెద్ద నిర్మాణాలను నిర్మించడానికి, ఉపగ్రహాల్లో ఇంధనం నింపి వాటి మెంటైనెన్స్ చూసుకోవడం కోసం, సపోర్టింగ్ శాంపుల్ రిటర్న్ మిషన్స్, అంతరిక్ష శిధిలాలను తగ్గించేందుకు ఈ డాకింగ్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఈ మిషన్ అంతరిక్ష అన్వేషణను మరింత సమర్థవంతంగా, స్థిరంగా చేస్తుంది.
సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అభివృద్ధికి అవసరమైన డాకింగ్ సామర్థ్యాలతో స్పేడెక్స్ మిషన్ భారతదేశాన్ని సన్నద్ధం చేయడమే కాకుండా, ఇస్రో మరింత సంక్లిష్టమైన లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. ఇలా ఈ ప్రయోగం భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయాణ ప్రయత్నాలకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో లాంగ్- టెర్మ్ స్పేస్ ప్రాజెక్ట్‌ల కోసం దీన్ని తెలుసుకోవడం చాలా అవసరం.
సింపుల్‌గా చెప్పాలంటే జాబిల్లిపై వ్యోమగామిని దించడం, చంద్రుడి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)ను నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే వ్యోమ నౌకల డాకింగ్, అన్ డాకింగ్ ఎంతో అవసరం. ఈ నేపథ్యంలోనేఇస్రో ఈ స్పేడెక్స్ ప్రయోగాన్ని చేపట్టింది.