ISRO Chairman On Aliens : ఏలియన్స్ ఉనికి గురించి ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భూమిపైనే కాకుండా విశ్వంలో ఎక్కడైనా ఎలియన్స్ ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రణవీర్ అల్లాబాడియా పాడ్ కాస్ట్లో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ గ్రహాంతరవాసుల ఉనికిపై పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.
వందేళ్లలో పెరిగిన టెక్నాలజీ
వందేళ్ల క్రితంతో పోలిస్తే భూమిపై టెక్నాలజీ విపరీతంగా పెరిగిందని సోమనాథ్ వ్యాఖ్యానించారు. ఈ వేగవంతమైన పరిణామం ఏలియన్స్ ఉనికి గురించి ఆలోచించడానికి పనికొస్తుందని అన్నారు. "గత వందేళ్లుగా భూమిపై ఉన్న మానవులతో పాటు, విశ్వంలో ఉన్న అన్ని జీవులు అభివృద్ధి చెంది ఉంటాయి. మానవుడి కంటే కొన్ని జీవరాశులు టెక్నాలజీలో ముందు ఉండొచ్చు. మరికొన్ని వెనుకుంటాయి. భూమిపై కాకుండా వేరే చోట ఎవరైనా మనకన్నా 1000 ఏళ్లు అడ్వాన్స్డ్గా లేదా 200 ఏళ్లు వెనకబడి ఉండొచ్చు. రానున్న 1000 ఏళ్లలో విశ్వవ్యాప్తంగా టెక్నాలజీ పెరగొచ్చు. భూమిపై కాకుండా వేరే చోట 1000 ఏళ్ల అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఇప్పటికే ఉండొచ్చు" అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు.