Humanoid Robot Race : ప్రస్తుత టెక్ ప్రపంచంలో 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్' (AI) హవా నడుస్తోంది. ప్రముఖ టెక్ సంస్థలు అన్నీ తమదైన ఏఐ టూల్స్ నిర్మించుకునే పనిలో ఉన్నాయి. ఓపెన్ ఏఐకు చెందిన 'చాట్‌జీపీటీ', గూగుల్‌కు చెందిన 'జెమినీ'లకు పోటీగా యాపిల్ కంపెనీ 'ఆస్క్' అనే ఏఐ టూల్‌ను అభివృద్ధి పరుస్తోంది. ఇక భారతీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ ఫండింగ్ చేసి 'హనుమాన్' అనే ఏఐ టూల్‌ను డెవలప్ చేయిస్తున్నారు. త్వరలోనే దీనిని లాంఛ్ కూడా చేయనున్నారు. ఇంకా ప్రచారంలోకి రాని పలు కంపెనీలు కూడా ఏఐ టూల్స్ రూపకల్పన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
హ్యూమనాయిడ్ రోబో రేస్
ఒకవైపు ఏఐ టూల్స్ రూపకల్పనలో పోటీపడుతున్న టెక్ దిగ్గజాలు, మరోవైపు హ్యూమనాయిడ్ రోబోల తయారీపైనా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. అమెరికాకు చెందిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఇప్పటికే 'ఆప్టిమస్' అనే హ్యూమనాయిడ్ రోబోను తయారు చేయించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. దీనిని దాదాపు 66 మిలియన్ల మంది వీక్షించారు. ఈ ఆస్టిమస్ అనే రోబో ఎవరి సాయం లేకుండా, తనకు నచ్చినట్లుగా సొంతంగా నడుస్తోంది. అంటే తనకు తానే స్వయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సొంతంగా ఆలోచిస్తోంది!
'ప్రస్తుతానికి ఈ రోబో పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేయడం లేదు. కానీ భవిష్యత్‌లో ఇది స్వతంత్రంగా ఆలోచిస్తూ, తన పనులు తనే చేసుకోగలుగుతుంది' అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడం విశేషం.
అమెజాన్ రోబో : అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, టెక్నాలజీ కంపెనీ ఎన్వీడియాతో కలిసి కృత్రిమ మేధ కలిగిన హ్యూమనాయిడ్ రోబోను తయారు చేయించడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం 'ఫిగర్ ఏఐ' అనే టెక్ స్టార్టప్‌కు నిధులు అందిస్తున్నారు. ఈ విషయాన్ని బ్లూమ్ బెర్గ్ న్యూస్ తెలిపింది.