How To Protect Personal Information Online :ఇది ఇంటర్నెట్ యుగం. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం చాలా పనుల కోసం ఇంటర్నెట్‌పై ఆధారపడుతుంటాం. ప్రత్యేకించి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మనం నిత్యం ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉంటున్నాం. మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక వివరాలు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఇంటర్నెట్ ప్రపంచంలోకి అప్‌లోడ్ చేస్తున్నాం. అయితే ఆ సమాచారం సేఫేనా? అది దుర్వినియోగం అయ్యే ముప్పు ఉంటుందా? అనే ప్రశ్నలు ఉదయిస్తుంటాయి. ఈ ప్రశ్నలు తలెత్తే అవకాశం ఇవ్వకుండా, డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లిన మన వ్యక్తిగత సమాచారానికి సేఫ్టీని అందించే విలువైన టిప్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.
- స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్
మీరు వినియోగించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన పాస్‌వర్డ్స్ స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోండి. మీ పుట్టిన తేదీ, 1234 లాంటి అత్యంత సాధారణ పాస్‌వర్డ్స్ వాడకూడదు. ఎందుకంటే వాటిని హ్యాకర్లు చాలా ఈజీగా హ్యాక్ చేస్తారు. పాస్వర్డ్ కనీసం 12 అక్షరాలలో ఉండేలా చూడండి. వాటిలో సంఖ్యలు, అక్షరాలు, చిహ్నాలు మిక్స్‌డ్‌గా ఉంటే చాలా సేఫ్. మీ వ్యక్తిగత సమాచారంలోని పేరు, ఊరుతో ముడిపడిన పదాలు పాస్‌వర్డ్‌లో ఉండకూడదని గుర్తుంచుకోండి. - అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయొద్దు
వెబ్ బ్రౌజింగ్ చేసే క్రమంలో ఏవేవో పాప్-అప్స్ వస్తుంటాయి. వాటిలో ఏది పడితే దాన్ని క్లిక్ చేయకూడదు. మన పేరుతో ఏదైనా అపరిచిత మెయిల్ ఐడీ నుంచి మెయిల్ వచ్చినా దాన్ని తెరవకూడదు. అయితే ఇలాంటి మెయిల్స్‌ను చూసి ఆతురతలో చాలా మంది ఓపెన్ చేసి చూస్తున్నారని ఒక అధ్యయనంలో తేలింది. అలాంటి అపరిచిత మెయిల్స్‌ను ఓపెన్ చేస్తే, మన ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి స్పైవేర్ డౌన్‌లోడ్ అయ్యే ముప్పు ఉంటుంది. ఇలాంటి స్పైవేర్‌లు అనుకోకుండా డౌన్‌లోడ్ అయినా ఇబ్బంది కలగకూడదంటే, నాణ్యమైన యాంటీ సాఫ్ట్‌వేర్‌ను మనం సిద్ధంగా ఉంచుకోవాలి. - వ్యక్తిగత వివరాలు షేర్ చేయొద్దు
మన పర్యటనల వివరాలను, వ్యక్తిగత జీవితంతో ముడిపడిన ఫొటోలు/వీడియోలను సోషల్ మీడియాలో పెట్టకపోవడమే బెటర్. ఒకవేళ వాటిని పోస్ట్ చేసినా, ప్రైవసీ సెట్టింగ్స్ సరిగ్గా చేసుకోవాలి. లేదంటే ఆ సమాచారం తప్పుడు వ్యక్తుల చేతికి చిక్కి దుర్వినియోగం అయ్యే రిస్క్ ఉంటుంది. నెటిజన్లలో దాదాపు 30 శాతం మందికి సోషల్ మీడియాలో తాము పంచుకునే సమాచారం దుర్వినియోగం అవుతుందనే విషయం కూడా తెలియదని ఒక సర్వేలో వెల్లడైంది. 12 శాతం మందికి ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది తెలియదని ఆ సర్వేలో గుర్తించారు. - ఉచిత వైఫైతో జాగ్రత్త
ఉచిత వైఫైయే కదా అని దాన్ని వాడేయొద్దు. ఒకవేళ దాన్ని వాడినా, ఆ సమయంలో బ్యాంకింగ్ లావాదేవీలు అస్సలు చేయొద్దు. ఎందుకంటే, ఉచిత వైఫైని అందిస్తున్న వారు మీ బ్యాంకింగ్ లావాదేవీల సమాచారాన్ని ట్రాక్ చేసే ముప్పు ఉంటుంది. ఇంటి బయటికి వెళ్తున్నప్పుడు ఫోన్‌లో ఆటోమేటిక్ వైఫై కనెక్షన్ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవాలి. వీపీఎన్ సర్వీసులను ఉపయోగించుకోవాలి. ఇంటి బయట ఉన్నప్పుడు కీలకమైన ఆర్థిక లావాదేవీలు చేయకూడదు. - యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్
యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ కొనడాన్ని కొందరు అనవసర భారంగా భావిస్తుంటారు. వాస్తవానికి అది అత్యవసరం. ఇది కంప్యూటర్ భద్రతను పెంచుతుంది. బ్రిటన్‌లోని దాదాపు 25 శాతం కంప్యూటర్లు తరుచుగా వైరస్ ఎటాక్ బారినపడుతుంటాయి. అంటే కంప్యూటర్ల భద్రతకు ఎంతటి ముప్పు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి ఎదురుకావద్దంటే యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ వాడాలి. - లింక్ చెక్ చేయండి
ఎవరైనా మీకు ఏదైనా యూఆర్ఎల్ లింక్ పంపిస్తే, దానిని నిశితంగా పరిశీలించాలి. అది సేఫ్‌గా ఉందా, లేదా అనేది తనిఖీ చేయాలి. ఎందుకంటే, కొన్ని ఫిషింగ్ లింక్స్‌ను మీరు క్లిక్ చేస్తే, మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లోని వ్యక్తిగత సమాచారం బదిలీ అయిపోతుంది. మీ సిస్టమ్‌లోకి మాల్వేర్ డౌన్‌లోడ్ అయిపోతుంది. - లాగౌట్ చేయండి
ఆన్‌లైన్ బ్యాంకింగ్ పూర్తయ్యాక, ఈమెయిల్ పంపడం పూర్తయ్యాక, తప్పకుండా లాగౌట్ అవ్వాలి. బ్రౌజర్‌ను మూసివేయాలి. ప్రత్యేకించి పబ్లిక్ వైఫైని వాడేటప్పుడు ఈ జాగ్రత్త తప్పనిసరి. ప్రతినెలలో కనీసం ఒకసారైనా మీ ఆన్‌లైన్ అకౌంట్లు, సోషల్ మీడియా ఖాతాలను లాగౌట్ చేయాలి. తద్వారా మీ డిజిటల్ సేఫ్టీ మరింత పెరుగుతుంది. - క్యాచేను క్లియర్ చేయండి
మీ ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలన్నా, వెబ్ బ్రౌజింగ్‌లో సమస్యలు రావొద్దన్నా, క్యాచేను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. ఇది మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ప్రపంచాన్ని శుభ్రంగా, సాఫీగా ఉంచుతుంది. మనం అప్పటివరకు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిన వెబ్సైట్ల సమాచారం క్యాచేలో ఉంటుంది. క్యాచేను డిలీట్ చేస్తే ఆ సమాచారమంతా చెరిగిపోతుంది. దీనివల్ల మీ ప్రైవసీ మరింత బలపడుతుంది. మీ ఆన్‌లైన్ యాక్టివిటీని ఇతరులు అంచనా వేయడం కుదరదు. ఫోన్‌లో, కంప్యూటర్‌లో ఎందులోనైనా మనం సెట్టింగ్స్‌లోకి వెళ్లి క్యాచేను తొలగించవచ్చు. అయితే ఇలా క్యాచే క్లియర్ చేసేటప్పుడు ఏయే ఫొటోలు, ఫైల్స్ తొలగించాలో, ఏవి తొలగించకూడదో మీరే ఎంపిక చేసుకోవచ్చు. - మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్
హ్యాకర్లు మీ ఆన్‌లైన్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను క్రాక్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. అందుకే ఒకటికి మించిన స్టెప్స్‌తో కూడిన సెక్యూరిటీని మన ఆన్‌లైన్ లేదా సోషల్ మీడియా అకౌంటుకు యాడ్ చేసుకోవాలి. ఈక్రమంలో పాస్‌వర్డ్‌కు అదనంగా ఓటీపీ, పిన్, ఫింగర్ ప్రింట్ వంటి సెక్యూరిటీ ఫీచర్లను జోడించుకోవచ్చు. దీనివల్ల మీ సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించడం చాలా కష్టమవుతుంది. - పాస్‌కోడ్‌లను ఉపయోగించండి
మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకమైన పాస్ కోడ్‌ను తయారు చేసుకోండి. అది ఎంటర్ చేస్తేనే ఆన్‌లైన్, సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ అయ్యేలా చేయండి. దీని వల్ల మీ డివైజ్ హ్యాక్ అయ్యే రిస్క్ తగ్గిపోతుంది. ఫేస్ ఐడీ, ఫింగర్ ప్రింట్ ఆప్షన్లు కూడా ఎంతో సేఫ్టీని అందిస్తాయి. హ్యాకర్లు ఈజీగా అంచనా వేయగలిగే పిన్ నంబర్లను వాడటం మానేయండి. పిన్ నంబర్లలో పేర్లు, తేదీలు ఉండకుండా జాగ్రత్త పడండి. - వీపీఎన్
వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్. ఇంటర్నెట్ ద్వారా మరొక నెట్‌వర్క్‌కు సురక్షితమైన కనెక్షన్‌ను అందించడానికి వీపీఎన్ ఉపయోగపడుతుంది. దీని వల్ల మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీని ఎవరూ చూడలేరు. మీ ప్లేసును ఎవరూ ట్రేస్ చేయలేరు. మీ పేరు ఎవరికీ కనిపించదు. ప్రపంచంలో ఏదో ఇతర దేశం నుంచి మనం బ్రౌజ్ చేస్తున్నట్లుగా చూపించడమే వీపీఎన్ నెట్‌వర్క్ ప్రత్యేకత. దీని ద్వారా మన బ్రౌజింగ్ కోసం ఒక సర్వర్‌ను మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎక్స్‌ప్రెస్ వీపీఎన్ వంటి వీపీఎన్ సర్వీసుల్లో ఏదో ఒకదాన్ని మనం ఎంచుకోవచ్చు. - బహుళ ఈమెయిల్ అడ్రస్‌లు ఉపయోగించండి
మనం ఒక్కో పని కోసం ఒక్కో రకమైన ఈమెయిల్ ఐడీని కలిగి ఉండటం బెటర్. ప్రతి ఒక్కరూ కనీసం నాలుగు మెయిల్ ఐడీలను కలిగి ఉండాలని టెక్ నిపుణులు చెబుతుంటారు. దీనివల్ల మనం ఫిషింగ్ బారినపడే అవకాశాలు తగ్గిపోతాయి. మన సమాచారం చోరీ అయ్యే రిస్క్ సైతం తగ్గిపోతుంది. - స్వైప్ వద్దు
ఎక్కడపడితే అక్కడ క్రెడిట్ కార్డులు స్వైప్ చేయడం అంత సేఫ్ కాదు. దానికి బదులుగా మన ఫోనులోని ఏదైనా డిజిటల్ వ్యాలెట్‌లో క్రెడిట్ కార్డు వివరాలను సేవ్ చేసుకోవాలి. ఆ డిజిటల్ వ్యాలెట్ నుంచే పేమెంట్స్ చేసే అలవాటు చేసుకోవాలి. పేమెంట్ మోడ్‌లో క్రెడిట్ కార్డును ఎంచుకుంటే సరిపోతుంది. ఫలితంగా మీ క్రెడిట్ కార్డు సమాచారం బహిర్గతం కాదు. ఫలితంగా దాని భద్రత మరింత మెరుగవుతుంది.