తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీరు డౌన్​లోడ్ చేసే యాప్స్‌ అన్నీ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా! - Mobile App Safety Check - MOBILE APP SAFETY CHECK

Mobile App Safety Check : స్మార్ట్‌ఫోన్ యూజర్లు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. అందుకే ఈ ఆర్టికల్​లో మొబైల్ యాప్స్​ డౌన్​లోడ్​ చేసుకునే ముందు, అవి సురక్షితమైనవా? కావా? అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

Mobile App Security Test
Android App Safety Check (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 11:58 AM IST

Android App Safety Check :స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు తమ అవసరాల కోసం రకరకాల యాప్​లను డౌన్‌లోడ్‌ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా యాప్స్​ డౌన్​లౌడ్​ చేసుకునే ముందు, కచ్చితంగా సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకోవాలి. లేదంటే సైబర్‌ మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే డౌన్‌లోడ్‌ చేసుకునే ముందే ఆ యాప్‌ సురక్షితమా? కాదా? అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

థర్డ్‌ పార్టీ యాప్స్​ వద్దు!
గూగుల్‌ ప్లే, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ లాంటి అధికారిక స్టోర్స్​ నుంచి మాత్రమే యాప్స్​ డౌన్​లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి యాప్‌లను పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే, ప్లేస్టోర్​లో ఉంచుతాయి. ఒకవేళ ఏదైనా యాప్​ యూజర్ల భద్రతకు ముప్పు తలపెట్టే అవకాశం ఉందని భావించిస్తే, వెంటనే అలాంటి యాప్​లను తొలగించేస్తుంటాయి. కానీ థర్డ్ పార్టీ యాప్​ స్టోర్లు ఇలా ఉండవు. అందువల్ల థర్డ్‌ పార్టీ నుంచి కాకుండా కేవలం అధికారిక స్టోర్ల నుంచి మాత్రమే యాప్స్​ డౌన్​లోడ్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఇతర స్టోర్ల నుంచి ఎంచుకోవాల్సి వస్తే, అమెజాన్‌ యాప్‌ స్టోర్‌, శామ్‌సంగ్‌ గెలాక్సీ స్టోర్‌ లాంటి వాటిని ఉపయోగించుకోవచ్చు.

ప్రైవసీ పాలసీ చదవాలి!
చాలా మంది యూజర్లు యాప్‌ ప్రైవసీ పాలసీని చదవకుండానే వాటికి అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. ప్రైవసీ పాలసీ డాక్యుమెంట్‌ గందగోళంగా, అసమగ్రంగా ఉందంటే అది నకిలీ యాప్‌ అని గుర్తించాలి. డేటా సేకరణ, దాని వినియోగానికి సంబంధించిన సమాచారం మొత్తం ప్రైవసీ పాలసీలో ఉందో? లేదో? చెక్ చేయాలి.

డేటా తస్కరించకుండా!
వాణిజ్య ప్రకటనల ద్వారా యాప్​లను తయారు చేసే సంస్థలు ఆదాయాన్ని పొందుతుంటాయి. యూజర్లకు యాప్‌ను ఉచితంగా అందించడం కోసం, దానిని మెయింటైన్‌ చేయడం కోసం ఇది తప్పదు. యాప్‌ పనితీరు మెరుగుపర్చడం కోసం, యూజర్లకు మెరుగైన సర్వీసులను అందించడం కోసం కొంత సమాచారాన్ని సేకరించడం తప్పనిసరి. అయితే ఈ ప్రకటనలు యూజర్ల సమాచారాన్ని దొంగిలించి, థర్డ్‌ పార్టీ అడ్వర్టైజర్లకు విక్రయించే అవకాశం ఉంటుంది. కనుక పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే, మీ ఫోన్‌లోకి చొరబడి, సున్నితమైన వివరాలను కూడా సేకరించే ప్రమాదం ఉంటుంది. అందుకే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు, దాని డేటా కలెక్షన్‌ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మానిటైజేషన్‌ విధానంపై స్పష్టత లేకుంటే, కచ్చితంగా దానిని అనుమానించాల్సిందే.

రివ్యూస్​ & డౌన్‌లోడ్స్​
యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు, కచ్చితంగా వాటి రివ్యూలను, డౌన్​లోడ్​లను పరిశీలించాలి. తక్కువ రేటింగ్‌ ఉన్నవాటిని ఎంపిక చేసుకోకపోవడమే మంచిది. ఒక్కోసారి ఫేమస్‌ యాప్‌లకు కూడా తక్కువ రేటింగ్‌ ఉంటుంది. అలాంటప్పుడు అవి అధికారిక యాప్‌లా? కాదా? అనే విషయాన్ని ధ్రువీకరించుకోవాలి. ఒక్కోసారి అచ్చంగా నిజమైన యాప్‌లను తలపించేలా నకిలీ యాప్‌లను సృష్టిస్తుంటారు. ఇలాంటి వాటి పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి.

ప్రతిదానికీ పర్మిషన్లు ఇచ్చేయవద్దు!
యాప్స్​ డౌన్​లోడ్ చేసుకునేటప్పుడు, కొన్ని అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టే ఆ యాప్‌ సురక్షితమైనదా? కాదా? అని తెలుస్తుంది. ఉదాహరణకు కాలిక్యులేటర్‌ యాప్‌నకు మైక్రోఫోన్‌, లొకేషన్‌ డేటాలతో సంబంధం ఉండదు. అయినా కూడా, వాటికి పర్మిషన్​ అడుగుతోందంటే, దానిని కచ్చితంగా అనుమానించాల్సిందే. అందుకే యాప్​లు ఎలాంటి పర్మిషన్లు కోరుతున్నాయో చూసుకోవాలి. సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గుర్తిస్తే, ఆ యాప్‌లను వెంటనే డిజేబుల్​ చేసేయాలి. ఈ విధమైన చర్యలు తీసుకుంటేనే, మీరు సురక్షితంగా ఉండగలుగుతారు.

ఫ్రీ కూపన్ కోడ్స్​ & గ్రాఫిక్ డిజైన్ టూల్స్ కావాలా? ఈ టాప్-10 వెబ్​సైట్స్​పై ఓ లుక్కేయండి! - Incredibly Useful Websites

కంటి చూపుతోనే స్క్రీన్​ను ఆపరేట్ చేసేలా - యాపిల్ నయా ఫీచర్స్​! - Apple Accessibility Features

ABOUT THE AUTHOR

...view details