Gmail New Shield Email Feature:ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇది స్పామ్ మెయిల్స్‌కు చెక్ పెట్టేందుకు ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
మనలో చాలామంది వ్యక్తిగత అవసరాలకు ఒక మెయిల్ ఐడీ, ఆఫీసు అవసరాలకు మరో ఐడీ వాడుతుంటారు. ముఖ్యమైన మెయిల్స్‌ను మిస్ కాకుండా ఉండేందుకే ఇలా చేస్తుంటారు. పైగా లాగిన్ కోసం ఎక్కడిపడితే అక్కడ మెయిల్ ఐడీ ఇవ్వడానికీ జంకుతుంటారు. దీని వెనుక అసలు కారణం స్మామ్ బెడద. చాలా సార్లు అవసరమైన మెయిల్స్ కంటే ఈ అవాంఛిత మెయిల్స్‌తో మన ఇన్‌బాక్స్ నిండిపోతుంది. దీంతో ఈ సమస్యపై పరిష్కారం చూపేందుకు గూగుల్.. 'షీల్డ్ ఈమెయిల్' పేరిట సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ ఫీచర్ సాయంతో తాత్కాలికంగా మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇకపై ఎక్కడైనా లాగిన్ కావాలంటే ఈ షీల్డెడ్ మెయిల్ ఐడీని వాడుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసిన ఐడీ 10 నిమిషాలు మాత్రమే పనిచేస్తుందని సమాచారం. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మరో మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌పై గూగుల్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.