Google Latest Update: గూగుల్‌లో ఏ అంశం గురించి సెర్చ్ చేసినా దాని తాలూకా ఫేక్ అకౌంట్స్ కన్పిస్తూ ఉంటాయి. అది కంపెనీ అధికారిక ఖాతానేనా? కాదా? అనే విషయం తెలియకపోవడంతో చాలామంది ఫేక్ అకౌంట్స్‌నే వినియోగిస్తున్నారు. దీంతో ఫేక్ వెబ్‌సైట్ల బాధితుల సంఖ్య పెరుగుతోంది. వీటిని అరికట్టేందుకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నడుంబిగించింది. అందులో భాగంగా తన సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించే ఫలితాలకు వెరిఫైడ్ బ్యాడ్జ్ అందించేందుకు సిద్ధమైంది.
"కంపెనీలకు సంబంధించిన అధికారిక అకౌంట్స్‌ను గుర్తించేందుకు కొత్త ఫీచర్స్ తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం గూగుల్‌లోని నిర్దిష్ట వ్యాపారాల వెబ్‌సైట్ల పక్కనే చెక్ మార్క్‌లను చూపించేలా టెస్ట్‌లు నిర్వహిస్తున్నాం." అని గూగుల్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే గూగుల్ సెర్చ్ ఫలితాల్లో మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీల అధికారిక సైట్ లింక్ పక్కన బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తోందని ధవెర్జ్ నివేదించింది. టెస్టింగ్ స్టేజ్‌లో కొందరు వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం గూగుల్ ఈ సదుపాయాన్ని ఇంకా రోలవుట్ చేయలేదు.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సప్‌ల్లో అధికారుల అకౌంట్స్‌ను గుర్తించేందుకు వెరిఫైడ్ బ్యాడ్జ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటి సాయంతో ఫేక్ ఖాతాలను సులువుగా గుర్తించగలుగుతున్నాం. ఇకపై అలాంటి సదుపాయమే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లోనూ కనిపించనుంది. మోసపూరిత కంటెంట్‌ను గుర్తించి వాటిని సెర్చ్ రిజల్ట్స్‌లో చూపించకుండా ఉండేందుకు ఇప్పటికే ఆటోమేటెడ్ సిస్టమ్స్‌ను గూగుల్ ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.