Google Theft Protection Feature:ఫోన్ చోరీకి గురైతే వ్యక్తిగత డేటా దొంగిలించే ప్రమాదం ఉంది. మన ముఖ్యమైన విషయాలు చాలా వరకు ఫోన్‌లోనే ఉంటున్నాయి. దీంతో మొబైల్ ఫోన్ పోయినట్లయితే మన వ్యక్తిగత సమాచారం కూడా దొంగిలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫోన్ చోరీకి గురైన సందర్భాల్లో ఈ రకమైన ప్రమాదం జరగొచ్చు. దీన్ని నివారించేందుకు గూగుల్.. తెఫ్ట్ ప్రొటెక్షన్ కింద 3 కొత్త భద్రతా ఫీచర్లను విడుదల చేసింది. ఇవి చోరీకి గురైన సందర్భాల్లో ఫోన్ స్క్రీన్‌ను ఆటోమేటిక్‌గా లాక్ చేసేస్తాయి. ఈ ఫీచర్‌లు ఆండ్రాయిడ్ 10, ఆ తర్వాతి వెర్షన్‌లతో కూడిన ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పని చేస్తాయి.
తెఫ్ట్ ప్రొటెక్షన్: Google తీసుకొచ్చిన ఈ తెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్స్‌ను పరిచయం చేయడం ప్రారంభించింది. ప్లే సర్వీస్ ద్వారా కంపెనీ ఈ విషయాలను ముందుకు తీసుకువస్తోంది. ఈ ఫీచర్లను ఉపయోగించాలనుకుంటే గూగుల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి తెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ అని సెర్చ్ చేయాలి. ఇది కాకుండా Google సర్వీస్ పేజీకి వెళ్లడం ద్వారా కూడా ఈ ఫీచర్‌ను పొందొచ్చు. ఈ ఏడాది మేలో జరిగిన Google I/O 2024 ఈవెంట్‌లో ఈ ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేశారు.
ఆండ్రాయిడ్ థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్స్ ఇవే:
న్యూ స్మార్ట్ ఫీచర్:మీ ఫోన్ చోరీకి గురైనప్పుడు ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది మీ మొబైల్ చోరీకి గురైనట్లు గుర్తిస్తే Google AIని ఉపయోగించి ఆటోమెటిక్‌గా మీ ఫోన్ స్క్రీన్‌ను లాక్ చేసేస్తుంది. దీంతో దొంగలు మీ స్మార్ట్‌ఫోన్‌లోని డేటాను యాక్సెస్ చేయలేరు.
ఆఫ్‌లైన్ డివైజ్ లాక్:పైన చెప్పిన తెఫ్ట్ లాక్ ఫీచర్ దొంగతనాన్ని గుర్తించడంలో విఫలమైతే ఆఫ్‌లైన్ డివైజ్ లాక్, రిమోట్ లాక్ ఫీచర్స్ ఉపయోగపడతాయి. దొంగిలించిన మీ మొబైల్‌ను చాలా కాలం పాటు డిస్కనెక్ట్ చేసేందుకు దొంగలు ప్రయత్నిస్తే మీ మొబైల్ ఇంటర్నెట్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు కూడా ఈ ఆఫ్‌లైన్ డివైజ్ లాక్ ఫీచర్ ఆటోమేటిక్‌గా స్క్రీన్‌ను లాక్ చేసేస్తుంది.
రిమోట్ లాక్: రిమోట్ లాక్ ఫీచర్ చోరీకి గురైన మీ మొబైల్ ఫోన్ స్క్రీన్‌ను వేరే డివైజ్‌తో లాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఫోన్ చోరీకి గురైతే android.com/lock లింక్‌ను యాక్సెస్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. దీని కోసం సెటప్ సమయంలో ఫోన్ నంబర్‌ను అందించాలి.