తెలంగాణ

telangana

ETV Bharat / technology

సర్కిల్‌ టు సెర్చ్‌, టాక్‌బ్యాక్‌ - గూగుల్‌ 5 నయా ఫీచర్స్​ - వారికి మాత్రమే! - Google Features For Android Users - GOOGLE FEATURES FOR ANDROID USERS

Google New Features For Android Users : ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం గూగుల్‌ 5 సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. వీటిలో 'సర్కిల్​ టు సెర్చ్'​, 'టాక్ బ్యాక్' లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఎలా పని చేస్తాయంటే?

Google
Google (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2024, 5:12 PM IST

Google New Features For Android Users : ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం గూగుల్‌ 5 సరికొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. మ్యూజిక్‌ని ఆడియో సాయంతో కనిపెట్టేందుకు 'సర్కిల్‌ టు సెర్చ్‌' అనే ఫీచర్​ను తీసుకువచ్చింది. ప్రకృతి విపత్తుల గురించి ముందుగా తెలుసుకునేందుకు వీలుగా మరో ఫీచర్​ను తెచ్చింది. ఈ విషయాన్ని గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో వెల్లడించింది. ఆండ్రాయిడ్​ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లెట్లు, ఓఎస్‌ పవర్డ్‌ వాచ్‌ల్లో ఈ ఫీచర్లు వాడుకోవచ్చు.

సర్కిల్‌ టు సెర్చ్‌
సోషల్‌ మీడియాలో మనకు చాలా పాటలు నచ్చుతుంటాయి. ఆ పాటను కనిపెట్టేందుకు లిరిక్​ను గుర్తుపెట్టుకుని వెతుకుతాం. లేదా ప్రత్యేక టూల్స్ వాడుతాం. ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఇకపై అలాంటి అవసరం లేకుండా గూగుల్ 'సర్కిల్​ టు సెర్చ్​' అనే ఫీచర్​ను తీసుకువచ్చింది. మీ ఆండ్రాయిడ్​ ఫోన్‌లోని హోమ్‌ బటన్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేయగానే 'సర్కిల్‌ టు సెర్చ్‌' ఫీచర్‌ యాక్టివేట్‌ అవుతుంది. ప్లే అవుతున్న పాటను వెంటనే గుర్తించి స్క్రీన్‌పై దాని వివరాలు డిస్‌ప్లే చేస్తుంది. పాటకు సంబంధించిన సినిమా, గాయకుడు/ గాయకురాలు ఇలా అన్ని వివరాలు తెలియజేస్తుంది. అంతేకాదు ఆ పాటకు సంబంధించిన యూట్యూబ్‌ వీడియోలను కూడా చూపిస్తుంది.

టాక్‌బ్యాక్‌
దృష్టిలోపం ఉన్న వారి కోసం గూగుల్ ఈ టాక్​బ్యాక్ ఫీచర్​ను తీసుకువచ్చింది. దీనిని ఉపయోగించి దృష్టి లోపం ఉన్నవారు డిజిటల్‌ కంటెంట్‌ను సులువుగా నావిగేట్ చేయగలుగుతారు. ఈ గూగుల్​ టూల్‌ యూజర్లకు స్క్రీన్‌పైన ఉన్న టెక్ట్స్‌ని గట్టిగా చదివి వివిపిస్తుంది. గూగుల్‌ అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ జెమిని సాయంతో ఈ టాక్‌బ్యాక్‌ ఫీచర్‌ పని చేస్తుంది.

ఉదాహరణకు ఏదైనా ఫొటోను సోషల్‌ మీడియాలో సెర్చ్‌ చేస్తున్నప్పుడు ఆ ఫొటోలోని వ్యక్తులు, వారు ధరించిన దుస్తులు, చుట్టూ ఉన్న పరిసరాలు, చేస్తున్న పనులు ఇలా అన్నింటినీ ఈ టాక్‌బ్యాక్‌ వివరిస్తుంది. జెమిని ఏఐని సపోర్ట్‌ చేసే డివైజ్‌లలో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుందని గూగుల్ తెలిపింది.

నచ్చిన లాంగ్వేజ్‌లో, వాయిస్​లో
ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలంటే, దాని గురించి చదవాలి. కానీ ఇది చాలా బోరింగ్​గా ఉంటుంది. అందుకే మీకు నచ్చిన అంశాన్ని నేరుగా వినేలా గూగుల్ సరికొత్త టూల్ తీసుకువచ్చింది. లేటెస్ట్‌ వార్తలు తెలుసుకోవాలన్నా, వంటకాల గురించి చదవాలన్నా ఇలా ఏ అంశమైనా సరే ఈ కొత్త గూగుల్‌ టూల్‌ మీకు చదివి వినిపిస్తుంది. గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో ఈ ఫీచర్ ఉంటుంది. దీంతో మీకు నచ్చిన వాయిస్‌లో, స్పీడ్‌లో, భాషలో మీకు నచ్చిన అంశాన్ని వినవచ్చు. ఓవైపు ఇంట్లో పనిచేసుకుంటూనే, మరోవైపు నచ్చిన విషయాన్ని వినాలనుకొనేవారికి ఇదొక బెస్ట్‌ ఫీచర్‌.

వాచ్‌లో గూగుల్‌ మ్యాప్స్‌
మనకు కావాల్సిన లొకేషన్‌ తెలుసుకోవాలంటే, ఫోన్​లోని గూగుల్ మ్యాప్స్​ చూస్తుంటాం. కానీ దీని కోసం ప్రతిసారీ మొబైల్ చూడాల్సి వస్తుంది. ఇకపై ఇలాంటి అవసరం లేకుండా, మీ స్మార్ట్​ఫోన్​లోనే గూగుల్​ - మ్యాప్స్ చూసుకునే ఫీచర్​ను తీసుకువచ్చింది. అయితే దీని కోసం ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోకి గూగుల్ మ్యాప్స్ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నెట్‌వర్క్‌తో పనిలేకుండా ఇది పనిచేస్తుంది.

విపత్తులు
భూకంపం రావడాన్ని ముందే గ్రహించి యూజర్లకు హెచ్చరికలు జారీ చేసేలా గూగుల్‌ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సమీపంలో ఉన్న ప్రాంతంలో భూకంపం వస్తుందంటే, ఈ ఫీచర్​ కొన్ని సెకన్ల ముందే మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుంది. అంతే కాదు భూకంపం వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై సలహాలు, సూచనలు అందిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే మిగతా దేశాలకు దీనిని విస్తరించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details