Google Agrees To Restore Indian Apps On Play Store : గూగుల్ కంపెనీ తమ ప్లేస్టోర్ నుంచి తొలగించిన ఇండియన్ యాప్స్అన్నింటినీ పునరుద్ధరించడానికి అంగీకరించిందని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే సర్వీస్ ఛార్జీల చెల్లింపు సమస్యను పరిష్కరించుకునేందుకు కూడా గూగుల్ కృషి చేస్తోందని పేర్కొన్నారు.
"సోమవారం గూగుల్, ఇండియన్ స్టార్టప్ కంపెనీలు మమ్మల్ని కలిశాయి. మా ఆధ్వర్యంలో గూగుల్, టెక్ కంపెనీల మధ్య అనేక పర్యాయాలు చర్చలు జరిగాయి. చివరికి గూగుల్ కంపెనీ, ప్లేస్టోర్ నుంచి తొలిగించిన యాప్‌లను పునరుద్ధరించడానికి అంగీకరించింది."
- అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి
శాశ్విత పరిష్కారం!
'గూగుల్ కంపెనీకి, స్టార్టప్ కంపెనీలకు మధ్య సర్వీస్ ఛార్జీల విషయంలో వివాదం నడుస్తోంది. అయితే త్వరలోనే దీనికి శాశ్విత పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాం' అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. భారతదేశ సంకేతిక అభివృద్ధి ప్రయాణానికి, స్టార్టప్ కంపెనీల పురోభివృద్ధికి గూగుల్ సంస్థ మద్దతుగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏమిటీ వివాదం?
గూగుల్ కంపెనీ శుక్రవారం సర్వీస్ ఫీజు చెల్లించని యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించడం ప్రారంభించింది. తమ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ, భారత్‌కు చెందిన కొన్ని కంపెనీలు సర్వీస్ ఫీజు చెల్లించడం లేదని గూగుల్ ఆరోపించింది. షాదీ, మాట్రిమోనీ, భారత్ మాట్రిమోనీ, జాబ్ సెర్చింగ్ యాప్ నౌకరీ, ఆల్ట్ (ఆల్ట్ బాలాజీ), ఆడియా ప్లాట్‌ఫాం కుకు ఎఫ్ఎం, డేటింగ్ యాప్ క్వాక్‌క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ లాంటి యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించింది.
సర్వీస్ ఛార్జ్ కట్టాల్సిందే!
గూగుల్ కంపెనీ ప్లేస్టోర్‌లోని యాప్‌లపై 15 శాతం నుంచి 30 శాతం వరకు సర్వీస్ ఛార్జీ వసూలు చేసేది. అయితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలతో, గూగుల్ ఈ ఫీజులను 11%-25% వరకు తగ్గించింది. అంతేగానీ, ఛార్జీల వ్యవస్థను పూర్తిగా తొలగించలేదు. సుప్రీం కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీనితో ప్లేస్టోర్‌లో ఉన్న యాప్‌లు అన్నీ కచ్చితంగా సర్వీస్ ఛార్జ్ చెల్లించాలని గూగుల్ స్పష్టం చేసింది. అయినప్పటికీ పలు యాప్‌లు గూగుల్‌కు డబ్బులు చెల్లించలేదు. దీనితో గూగుల్ కొన్ని భారతీయ యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించడం ప్రారంభించింది. గూగుల్ కంపెనీ చర్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది. దీనితో గూగుల్ కంపెనీ వెనక్కు తగ్గింది. ఇండియన్ స్టార్టప్‌లతో చర్చలకు ఒప్పుకుంది.
గూగుల్ బంపర్ ఆఫర్ - ఉచితంగా ఏఐ కోర్సులు - నేర్చుకుంటే ఉద్యోగం గ్యారెంటీ!
స్పామ్ కాల్స్/ మెసేజ్‌లు వస్తున్నాయా? 'చక్షు' పోర్టల్‌లో ఫిర్యాదు చేయండిలా!