Mira Murati Launches AI Startup:ఓపెన్ఏఐ మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) మిరా మురాటి 'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్' అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ స్టార్టప్ ద్వారా మురాటి, ఆమె టీమ్ AI టెక్నాలజీని మరింత యూజ్‌ఫుల్‌గా మార్చాలనుకుంటున్నారు. ఆమె స్థాపించిన ఈ కంపెనీకి చీఫ్ సైంటిస్ట్‌గా జాన్ షుల్మాన్ ఉన్నారు. ఆయన ఓపెన్ఏఐ కో-ఫౌండర్. అయితే జాన్ షుల్మాన్ ఇప్పుడు ఓపెన్ఏఐలో పనిచేయడంలేదు.
"థింకింగ్ మెషీన్స్ ల్యాబ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ప్రతి ఒక్కరి ప్రత్యేక అవసరాలు, లక్ష్యాల కోసం AI పని చేసేలా నాలెడ్డ్ అండ్ టూల్స్‌ను కలిగి ఉండే భవిష్యత్తును మేము బిల్డ్ చేస్తున్నాము" అని కంపెనీ వెబ్‌సైట్ పేర్కొంది.
థింకింగ్ మెషీన్స్ ల్యాబ్: మిరా మురాటి ప్రారంభించిన ఈ స్టార్టప్ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయగల AI వ్యవస్థలను రూపొందించేందుకు ప్రయత్నిస్తోంది. సైన్స్, ప్రోగ్రామింగ్ వంటి ఇతర రంగాలలో AIని ఉపయోగకరంగా మార్చడమే దీని లక్ష్యం. ఈ నేపథ్యంలో మురాటి AIని మరింత సమర్థవంతంగా తయారు చేయడంపై ఫోకస్ చేస్తున్నారు.
అదనంగా కంపెనీ అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించగల మల్టీమోడల్ వ్యవస్థను సృష్టిస్తుంది. దీంతోపాటు AI దుర్వినియోగం కాకుండా సేఫ్ అండ్ ఎథికల్‌గా మార్చేందుకూ కంపెనీ కృషి చేస్తుంది. మురాటీ గతంలో టెస్లాలో పనిచేశారు. అక్కడ ఆమె మోడల్ X కారు ప్రాజెక్టులో వర్క్ చేశారు.
అంతేకాక ఓపెన్ఏఐలో ఉన్నప్పుడు ఆమె ChatGPT, DALL-E, Codex వంటి AI సాంకేతికతల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మురాటి తన కొత్త స్టార్టప్ కోసం AI రంగంలో పనిచేస్తున్న అగ్రశ్రేణి నిపుణులు, ఇంజనీర్లను ఒకచోట చేర్చే పనిలో బిజీగా ఉన్నారు. ఈ కంపెనీ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు, AIలో పెద్ద మార్పులు తీసుకురావడంపై పనిచేస్తోంది.