Fingerprint Door Locks :మనం బయటకు వెళ్తున్నప్పుడు ఇంటికి రక్షణగా తాళాలు వేస్తుంటాం. అయితే.. కొన్నిసార్లు లాక్ ఎక్కడ పెట్టామో మర్చిపోవడం, లేదంటే పోగొట్టుకోవడం జరుగుతుంటాయి. దీంతో తప్పనిసరి పరిస్థితులలో తాళం పగలగొడుతుంటాం. ఇక.. చోరీకి వచ్చిన దొంగలు కూడా తాళం పగలగొడుతుంటారు. ఇకపై ఈ పరిస్థితి రాకుండా.. మీరు తాళం మరిచిపోయినా ఇబ్బంది లేకుండా.. దొంగలెవరూ ఇంట్లోకి వెళ్లలేకుండా.. ఫింగర్‌ప్రింట్స్ ప్యాడ్లాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి బయోమెట్రిక్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బయోమెట్రిక్ డోర్ లాక్ అంటే ఏమిటి?:ప్రస్తుతం మార్కెట్‌లో బయోమెట్రిక్ డోర్ లాక్స్‌కి డిమాండ్ బాగా పెరుగుతోంది. బయోమెట్రిక్ అనేది మీ వేలిముద్రను స్కాన్ చేసి దాని డేటాను నిల్వ చేసే సిస్టమ్. రేషన్ షాపు, ఆధార్ సెంటర్లో ఉపయోగించే మెషీన్ లాంటిది. ఈ తాళాలు టచ్ ప్యానెల్ కలిగి ఉంటాయి. ఇందులో థర్మల్ లేదా ఆప్టికల్ స్కానర్ ఉంటుంది. ఇక్కడే వేలు పెడతారు. అప్పుడు.. స్క్రీన్‌లోని సెన్సార్స్ మీ వేలిముద్రను స్కాన్ చేసి, నిల్వ చేసిన డేటాతో సరిపోల్చుతాయి. డేటా సరిపోలిన తర్వాత లాక్ తెరుచుకుంటుంది.
హోమ్స్ ఫింగర్ ప్రింట్ లాక్ ప్యాడ్స్ :ఫింగర్ ప్రింట్ లాక్స్ లో చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో హోమ్స్ ఫింగర్ ప్రింట్ లాక్ ప్యాడ్స్ ఒక రకం. ఇందులో ఇద్దరి వేలిముద్రలను నమోదు చేయొచ్చు. ఇవి ఇళ్లు లేదా ఆఫీసులకు చాలా బాగా సెట్ అవుతాయని సాంకేతిక నిపుణులు అంటున్నారు. అలాగే ఇది బ్యాటరీ సాయంతో నడుస్తుంది. కాబట్టి దీన్ని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. USB కేబుల్ సాయంతో ఛార్జ్ చేయవచ్చు. ఈ lock pads ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ధర కూడా అందుబాటులోనే ఉంది.