Bajaj Chetak Overtake TVS Iqube: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు పర్యావరణ హాని కారణంగా ఇప్పుడు వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై మొగ్గు చూపుతున్నారు. దీంతో గత కొద్ది కాలంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలతో పాటు కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు తమ ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, కంపెనీలకు రాయితీలు అందిస్తుండటం వంటివి ఈవీల వృద్ధికి కలిసొచ్చింది.
దీంతో ఎలక్ట్రిక్ టూ- వీలర్ వాహన రంగంలో దిగ్గజ కంపెనీల మధ్య పోటీ క్రమంగా పెరుగుతోంది. ఈవీల విక్రయాల్లో క్రమంగా తమ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా టీవీఎస్, బజాజ్ కంపెనీల మధ్య ఈ విషయంలో గట్టి పోటీ నెలకొంది. ఇన్నాళ్లు ఓలా తర్వాత టీవీఎస్ రెండో స్థానంలో ఉండగా సెప్టెంబర్‌లో బజాజ్ చేతక్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. మరోవైపు అత్యధిక విక్రయాలతో ఓలా ఎలక్ట్రిక్ అగ్రస్థానంలో కొనసాగుతున్నా.. మార్కెట్ వాటా మాత్రం క్షీణించడం గమనార్హం.
సెప్టెంబర్ నెలకు సంబంధించి వాహన సేల్స్‌లో ఓలా 23,965 యూనిట్ల విక్రయాలతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఒకప్పడు నెలకు సగటున 30 వేల యూనిట్ల వాహనాలును విక్రయించే ఈ ఓలా సంస్థ మార్కెట్ వాటా తాజాగా 27 శాతానికి పడిపోయింది. అదే సమయంలో బజాజ్ ఆటో తన విక్రయాలను పెంచుకుంటోంది. 18,933 చేతక్‌లను విక్రయించి రెండో స్థానంలో నిలిచింది. టీవీఎస్ సైతం 17,865 యూనిట్ల ఐక్యూబ్‌లను విక్రయించింది. ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్ కంపెనీలు.. ఏథర్, హీరో మోటోకార్ప్ బ్రాండ్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.