Apple Stops Selling 3 iPhone Models:టెక్ దిగ్గజం యాపిల్ ఐరోపా యూనియన్ దేశాలలో తన మూడు ఐఫోన్ మోడళ్ల విక్రయాలను నిలిపివేసింది. 'ఐఫోన్ 14', 'ఐఫోన్ 14 ప్లస్', 'ఐఫోన్ SE (3rd Gen)' మోడల్స్‌ను చాలా యూరోపియన్ దేశాలల్లోని తన ఆన్లైన్ స్టోర్ల నుంచి తొలగించింది. ఇప్పుడు ఇవి ఆఫ్‌లైన్ స్టోర్లలలో కూడా అమ్మకానికి అందుబాటులో లేవు. యూరోపియన్ యూనియన్ (EU) నిబంధనల కారణంగానే యాపిల్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
కారణం ఇదే!:2022 సంవత్సరంలో EU తన మొత్తం 27 దేశాలలో విక్రయానికి అందుబాటులో ఉండే ఫోన్‌లు, కొన్ని ఇతర గాడ్జెట్‌లు తప్పనిసరిగా USB-C పోర్ట్‌ను కలిగి ఉండాలని నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదట్లో యాపిల్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో ప్రస్తుతం 'ఐఫోన్ 14', 'ఐఫోన్ 14 ప్లస్', 'ఐఫోన్ SE (3rd Gen)' ఛార్జింగ్ కోసం USB-C పోర్ట్‌ను కలిగి లేనందున కంపెనీ వీటిని నిలిపివేయాల్సి వచ్చింది.
యాపిల్ గత వారం రోజులుగా తన పాత స్టాక్‌ను స్టాక్‌ను క్లియర్ చేసే పనిలో పడింది. ఇప్పటివరకు ఇది ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, స్వీడన్‌తో పాటు అనేక ఇతర దేశాలలోని తన స్టోర్స్ నుంచి ఈ ప్రొడక్ట్‌లను తొలగించింది. స్విట్జర్లాండ్‌లో కూడా ఈ మూడు మోడల్ ఐఫోన్ల విక్రయాలు నిలిచిపోయాయి. స్విట్జర్లాండ్ ఐరోపాలో భాగం కానప్పటికీ ఆ దేశంలోని చాలా వరకు నిబంధనలు.. యూరోపియన్ యూనియన్ చట్టాలను పోలి ఉంటాయి. అలాగే ఈ మోడల్ ఐఫోన్‌లను ఇకపై ఉత్తర ఐర్లాండ్‌లో కూడా కొనుగోలు చేయలేరు.
ఇకపోతే వచ్చే ఏడాది మార్చిలో యాపిల్ 'ఐఫోన్ SE (4th generation)' USB-C పోర్ట్‌తో రిలీజ్ కావచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ ఐఫోన్ త్వరలో యూరప్‌లో కూడా తిరిగి రావొచ్చు.