Android Phone Users Alert :ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతున్నారు. వాళ్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు 'డర్టీ స్ట్రీమ్' అనే ఒక మాల్వేర్ను ప్రయోగిస్తున్నారు. దీనితో యూజర్ల ఫోన్‌ను హ్యాక్ చేసి, వాళ్ల డివైజ్‌ను పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ సెక్యూరిటీ టీమ్ - ఆండ్రాయిడ్ యూజర్లను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తోంది.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని అత్యంత కీలకమైన కంటెంట్ ప్రొవైడర్ సిస్టమ్‌ను లక్ష్యంగా చేసుకుని డర్టీ స్ట్రీమ్ అనే మాల్వేర్ దాడి చేస్తుంది. తరువాత ఆ డివైజ్‌ను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. యూజర్ల ప్రమేయం లేకుండా, ఇంటర్ యాప్ కమ్యునికేషన్, ఫైల్ షేరింగ్ చేయగలుగుతుంది. ఈ విధంగా హ్యాకర్లు ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల డేటాను సులువుగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. అలాగే డివైజ్ ఫంక్షనాలిటీని కూడా మార్చగలుగుతున్నారు. ఇది యూజర్ల ప్రైవసీకి, భద్రతకు పెనుముప్పుగా మారే ప్రమాదం ఉంది.
ఈ యాప్స్‌ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి!
ప్లేస్టోర్‌లో పలు దుర్భలమైన, హానికరమైన యాప్స్ ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ భద్రత సిబ్బంది గుర్తించారు. ఆ యాప్స్ అన్నీ కలిపి సుమారుగా 4 బిలియన్ల డౌన్లోడ్స్ కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో ప్రధానమైన యాప్స్ :
- షావోమీ ఫైల్ మేనేజర్ - 1 బిలియన్ డౌన్లోడ్స్
- డబ్ల్యూపీఎస్ (WPS) ఆఫీస్ - 500 మిలియన్ డౌన్లోడ్స్
వాస్తవానికి ఈ యాప్‌ల కోసం సెక్యూరిటీ ప్యాచ్‌లను విడుదల చేశారు. అయినప్పటికీ ఇవి ఎంత వరకు పనిచేస్తాయో చెప్పలేము. కనుక వెంటనే ఈ యాప్‌లను అన్ఇన్స్టాల్ చేయాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.