Elon Musk About AI :ఉద్యోగాలపై కృత్రిమ మేధ (AI) ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల భవిష్యత్లో అందరూ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
టెక్ ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. ఏఐ అభివృద్ధి దిశగా జరుగుతున్న ప్రయోగాలు ఓ వైపు ఆసక్తి రేకెత్తిస్తుంటే, మరోవైపు చాలా మందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏఐ వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. వారిలో ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు.
ప్రమాదం పొంచి ఉంది!
ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల - ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను మనుషుల్లా చూడడం ఆపాలని గట్టిగానే హెచ్చరించారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా ఇలాంటి హెచ్చరికలే చేస్తున్నారు. ప్యారిస్ కేంద్రంగా 'వివా టెక్' పేరిట నిర్వహించిన స్టార్టప్ సదస్సులో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఏఐ టెక్నాలజీపై చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.
రానున్న రోజుల్లో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి?
రానున్న రోజుల్లో జాబ్ చేయడం అనేది ఒక వ్యాపకం(హాబీ)గా మారుతుందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. అన్ని రకాల ఉత్పత్తులను, సేవలను ఏఐ ఆధారిత సాధనాలు, రోబోలే అందిస్తాయని ఆయన అంచనా వేశారు. అదే జరిగితే మనుష్యులు ఎవ్వరికీ జాబ్స్ ఉండకపోవచ్చునని పేర్కొన్నారు. అవసరమైతే ఒక హాబీగా మాత్రమే జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చని తెలిపారు. అయితే, ఆ స్థితికి చేరుకోవాలంటే, ప్రపంచంలో ప్రతిఒక్కరికీ 'యూనివర్సల్ హై ఇన్‌కమ్' ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంటే ప్రపంచంలోని ప్రజలందరికీ కచ్చితంగా భారీ ఆదాయం వస్తూ ఉండాలని అన్నారు. కానీ ఇది ఎలా సాధ్యమో ఆయన చెప్పలేదు. వాస్తవానికి దీనిపై ఎలాన్ మస్క్ మరింత లోతుగా విశ్లేషించలేదు.