Yuva on Young Artist From Hyderabad : చిత్రం గీసినప్పుడు ఓ రకమైన ఆనందం కలిగినా దాన్ని కొన్ని రోజుల తర్వాత చూస్తే ఎనలేని సంతోషం కలుగుతుంది. చిత్రం పలికించే మాటలు అప్పటికి మూగవైనా కూడా తర్వాత తోటివారితో పాటు ప్రేక్షకులు వాటిని బాగున్నాయంటూ మెచ్చుకుంటుంటే ఆ భావన మనసుకు హాయితో పాటు కళకు ప్రోత్సాహాన్నిస్తుంది. అలాంటి ప్రోత్సాహం తన మిత్రులతో పాటు కళాశాల తనకిస్తుందని చెబుతోంది ఈ యువతి. చిత్రం వేసే ప్రాసెస్‌ను ఎంజాయ్ చేస్తే చిత్రం వాస్తవికతకు దగ్గరగా వస్తుందంటోంది.
అందంగా బొమ్మలేస్తున్న ఈ యువతి పేరు వీఎస్ అరుణ శ్రీ. హైదరాబాద్ గౌతం నగర్‌లో స్థిర నివాసం. స్థానిక శాంతినికేతన్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. తర్వాత ఇంటర్ పూర్తి చేసి, ప్రస్తుతం మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. చిన్నప్పటి నుంచి ఉన్న తన ఆసక్తికి తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడవడం, కరోనా ఖాళీ సమయంలో తనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకునే ప్రయత్నం చేయడంతో ఇలా చిత్రాలు వేయగలుగుతున్నాను అని చెబుతోంది.
గ్రీకు పురాతన కథను ప్రతిబింబించేలా :చిత్రాల్లో పలు శైలిలు ఉంటాయి. అక్రాలిక్, వాటర్ స్కెచ్, 2డీ ఇలా పలు రకాలు ఉంటాయని చెబుతోంది అరుణ శ్రీ. వీటన్నింటిని గురించి ఫైన్ ఆర్ట్స్ చదువుతుండడంతో తనకు తెలిసిందంటోంది. అన్నింటిపై అవగాహన ఉండడం, ఒకదాంట్లో నిష్ణాతులై ఉండడం ఉత్తమమనే విషయాన్ని బలంగా నమ్ముతానని చెబుతోందీ చిత్రకారిణి. తన చిత్రాలన్నింటికీ తన తండ్రే మొదటి ప్రేక్షకుడని, ఎలాంటి తప్పు ఉన్న ఇట్టే పసిగట్టి వాటిని సరిచేసేందుకు సూచనలిస్తారని చెబుతోంది. తాను వేస్తున్న డిఫరెంట్ స్టైల్స్ గురించి ఇలా వివరిస్తోంది.
చిత్రం వేస్తుంటే అందులో కళ్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తే చిత్రంలో కళ ఉట్టిపడుతుందని చెబుతోంది అరుణ శ్రీ. తాను గీస్తున్న చిత్రాల్లో పురాణ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తోంది. అందుకు తనకు చరిత్రతో పాటు మైథాలజీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తే ప్రధానంగా ఉందని చెబుతోంది. కళలు సమాజాన్ని మార్చేవి కావు, సమాజాన్ని ప్రతిబింబిచేవి అంటాడు ప్రముఖ రచయిత త్రివిక్రమ్. అలానే ఇటీవల మహిళలపై జరుగుతున్న దాడులకు చలించి, ఈ చిత్రకారిణి గ్రీకు పురాతన కథను ప్రతిబింబించే చిత్రం గీస్తోంది.