కబ్జాలు, సెటిల్‌మెంట్లు - సిరులతో కళకళలాడుతున్న వైసీపీ ఎమ్మెల్యే కుటుంబం YSRCP Woman Leader Corruption :రాయలసీమలో వర్షాలు లేక పంటలు పండినా పండకపోయినా అధికారపార్టీ నేతల అవినీతి పంట మాత్రం దండిగా పండుతోంది. కర్నూలు జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు అందినకాడికి ఇసుక, మట్టి మాఫియాతో దోచేశారు. కబ్జాలు, సెటిల్‌మెంట్లతో ఇసుక, మట్టి మాఫియాతో నిత్యం వారి ఇంటి సిరులు కళకళలాడిపోయాయి. ఆ మహిళా ప్రజాప్రతినిధి బంధువులైన బావ, మరిది, వియ్యంకుడు, కుమారుడు ఒక్కొక్కరూ ఒక్కో మండలాన్ని పంచుకుని వసూళ్లకు తెగబడ్డారు.
ఆమెకు దూరపు చుట్టమైన మరో జెడ్పీటీసీ సైతం ఆయన స్థాయిలో వసూళ్లు చేసి మామూళ్లు పంపుతున్నారు. ఆమె పుత్రరత్నం సెటిల్‌మెంట్ల పరిధి చేయిదాటిపోవడంతో సొంత మండలం వెల్దుర్తికి పంపినా అక్కడి నుంచి ఆయన దందా కొనసాగిస్తున్నారు. సదరు ప్రజాప్రతినిధి సొంతమండలంలో జాతీయ రహదారికి ఇరువైపులా భూములకు డిమాండ్ పెరిగడంతో పెద్ద ఎత్తున వెంచర్లు వేశారు. అక్కడ వారు వ్యాపారం చేయాలంటే ఆమె చెప్పినంత సమర్పించుకోవాల్సిందే.
నిత్య'కళ్యాణం' పచ్చతోరణంలా 'దుర్గం' నేత అవినీతి - ఆమె పేరు చెబితేనే వణుకుతున్న ప్రజలు - YSRCP Woman Leader Corruption
ప్రజాపతినిధి బంధువులే కాదు. అనుచరులు సైతం భూకబ్జాలు, ఆక్రమణలతో చెలరేగిపోతున్నారు. పత్తికొండ చెరువు ముందున్న తూము ప్రాంతాన్ని పూడ్చి అనుచరుడొకరు ఆక్రమించగా రైతులు అడ్డుకున్నారు. ఇరిగేషన్ అధికారులు ఆక్రమణలను తొలగించినా రాత్రికి రాత్రే మళ్లీ అక్కడే షెడ్లు వేయించారు. పత్తికొండ శివారులోని హంద్రీనీవా కాల్వ సమీపంలో ఓ విలేకరి కుటుంబానికి చెందిన స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఆరోపణలు ఉన్నాయి. ఓ దళిత కుటుంబం పొలాన్ని ఆక్రమించుకుని వెంచర్ వేసేందుకు మరో అనుచరుడు ప్రయత్నించగా అడ్డుకునేందుకు వెళ్లిన వారిపై దాడి చేశాడు. దళితులు ధర్నాలు, ఆందోళనలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తుగ్గలి మండలం శభాష్‌పురంలో రంగస్వామి మాన్యం భూమిని వైఎస్సార్సీపీ నాయకుడు ఒకరు ఆక్రమించారు. ఇప్పటికీ దీనిపై ఎలాంటి చర్యలు లేవు.
అడిగినంత మేర కమీషన్ ఇవ్వకుంటే ఆ నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయనివ్వరు. మద్దికెర-బేతంచెర్ల మధ్య రైల్వే పనులకు సంబంధించి గుత్తేదారును తీవ్రంగా ఇబ్బందిపెట్టారు. పని మొదలు పెట్టక ముందే కమీషన్ ఎలా ఇవ్వాలంటూ ఆ కాంట్రాక్టర్ లభోదిభోమన్నాడు. గుత్తేదారుడు, కూలీలపై దాడి చేయడమే గాక కారు, కంకర మిషన్ ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కృష్ణగిరి టోల్‌ప్లాజా వద్ద వీరి వాహనాలను ఉచితంగా వదిలేయలేదని అనుచరులు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.
నాడు అప్పులతో సతమతం - నేడు సిరులతో కళ కళ! - YSRCP Leader Irregularities
ప్రజాప్రతినిధి అండతో దిగువస్థాయి నేతలు అధికారులను బెదిరించడం పరిపాటిగా మారింది. హంద్రీ నది నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. నల్ల కాలువకు ఆనుకొని ఉన్న గుట్ట నుంచి అక్రమంగా ఎర్ర మట్టి తరలిస్తున్నారు. చక్కరాళ్ల రోడ్డు సమీపంలోని బూడిదగుండ్లు నుంచి యథేచ్ఛగా ఎర్ర మట్టిని దోచేస్తున్నారు. ఓ ప్రధాన అనుచరుడు ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయో తెలుసుకుని కమీషన్ వసూలు చేసుకుని వస్తాడు. నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టే ఎలాంటి అభివృద్ధి పనులనైనా ఈ ప్రజాప్రతినిధి వర్గానికి చెందిన నాయకులకే ఇవ్వాలి. నాణ్యత లేకుండా వారు ఆ పనులను చేసినా పర్యవేక్షక ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ప్రశ్నించడానికి వీళ్లేదు. కృష్ణగిరి మండల పరిధిలోని హంద్రీనీవా కాలువ గట్టు రాళ్లనూ వైసీపీ నాయకులే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు.
ఉద్యోగాల పేరుతోనూ భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. సబ్‌స్టేషన్ ఆపరేటర్ పోస్టులకు 10 లక్షల వరకు ధర నిర్ణయించారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టులకు 10లక్షలు, కార్యకర్త పోస్టుకైతే 2 నుంచి 3లక్షల వరకు వసూలు చేశారు. డబ్బులు కట్టినా కొంతమందికి ఉద్యోగాలు రాలేదు. వీరి అవినీతిపై ఓ టీవీ ఛానెల్‌లో కథనం ప్రసారమవ్వగా ఆ ఛానెల్ ప్రతినిధిపై ప్రజాప్రతినిధి అనుచరులు దాడికి దిగారు.
సకుటుంబ సపరివార సమేతంగా అక్రమాలు - ఆయనకు అడ్డు చెప్పే వారే లేరు! - YCP MLA irregularities in Krishna