YSRCP Mob Attacks on TDP Leaders in AP : దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో ఐదేళ్లుగా పేట్రేగిపోయిన వైఎస్సార్సీపీ మూకలు, అధికారం కోల్పోయాక కూడా అదే దమనకాండ కొనసాగిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాక రాష్ట్రంలో గత ఆరు రోజుల్లో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ అరాచక శక్తులు బలిగొన్నాయి. అనేక చోట్ల భౌతిక దాడులకు తెగబడుతున్నాయి.
ఫలితాలు వెల్లడైన రోజే మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన టీడీపీ కార్యకర్త షేక్ ఖాశీంను వైఎస్సార్సీపీ కార్యకర్తలు కర్రలు, క్రికెట్ బ్యాట్లతో కొట్టి పాశవికంగా చంపేశారు. తమ పార్టీ గెలిచిన సంతోషంలో ఖాశీం ద్విచక్ర వాహనానికి టీడీపీ జెండా కట్టుకుని స్నేహితుడితో కలిసి తిరుగుతుండగా, ఓటమిని జీర్ణించుకోలేని వైఎస్సార్సీపీ మూకలు ఈ దారుణానికి ఒడిగట్టాయి.
తాజాగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మరెడ్డిపల్లిలో టీడీపీ కార్యకర్త గిరినాథ్ చౌదరిని వేట కొడవళ్లతో వెంటాడి నరికేశారు. ఆయన సోదరుడు కల్యాణ్ పైనా హత్యాయత్నం జరిగింది. ఈ సంఘటనలో ఆయన తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆమె అనుచరుల పాత్ర ఉందని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఇంతటి అరాచకాలకు పాల్పడుతున్న వైఎస్సార్సీపీ మూకలు, ‘దొంగే.. దొంగా దొంగా’ అన్న రీతిన పెడబెబ్బలు పెడుతున్నాయి.
ఓటమిని భరించలేక వైఎస్సార్సీపీ మూకల దాడి- టీడీపీ నేతలకు తీవ్రగాయాలు - YSRCP ATTACKS
రాష్ట్రంలో టీడీపీ శ్రేణులే లక్ష్యంగా వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున హింసాకాండను ప్రోత్సహిస్తుంటే ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఏమీ తెలియనట్లుగా రాష్ట్రంలో టీడీపీ దాడులతో ఆటవిక పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారంటూ ఇటీవల ట్వీట్ చేశారు. ఆ పార్టీ నాయకులు గవర్నర్‌ను కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను కిరాతకంగా చంపడమే వైఎస్సార్సీపీ దృష్టిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.