YSRCP Leaders Occupying Government Lands in Kadapa: కడపలో ఖాళీ భూమి కనిపిస్తే చాలు అది ప్రభుత్వానిదైనా, ప్రైవేటుదైనా కబ్జా చేయాల్సిందే అన్న రీతిలో వైఎస్సార్సీపీ నాయకులు బరి తెగించారు. తెలుగు గంగ ప్రాజెక్టు కార్యాలయాల కోసం కేటాయించిన భూముల్లో 20 ఎకరాలు స్వాహా చేసేశారు. తెలుగుగంగ ప్రాజెక్టు కార్యాలయాలకు 60 ఎకరాలు కేటాయిస్తే ప్రస్తుతం 40 ఎకరాలు మాత్రమే ఉందని అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నాయి.
రెవెన్యూ వ్యవహారాల్లో అధికార పార్టీ నేతల జోక్యం - ఏకపక్షంగా భూ రికార్డులు తారుమారు
తెలుగుగంగ ప్రాజెక్టు కార్యాలయాల కోసం కడప శివారులోని మామిళ్లపల్లె వద్ద 1988లో 60 ఎకరాలు భూమి సేకరించారు. రైతులకు పరిహారం చెల్లించారు. కార్యాలయాలు నిర్మించారు. ఇక్కడే సీఈ కార్యాలయం కూడా ఉంది. ప్రాజెక్టు కార్యాలయాలు, సిబ్బంది ఉండేందుకు క్వార్టర్స్ కలిపి 40 ఎకరాల్లో నిర్మాణాలు చేశారు. మిగిలిన 20 ఎకరాలపై వైఎస్సార్సీపీ నేతల కన్ను పడింది. ఆ భూములను అక్రమంగా కాజేసినట్లు తెలిసింది.
దీనికి సంబంధించి మామిళ్లపల్లెకు చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా అసలు విషయం బయటపడింది. 1988లో నోటిఫికేషన్ ప్రకారం 60 ఎకరాల విస్తీర్ణం సర్వే నంబర్లతో సహా జాబితాలో కనిపించింది. సమాచార హక్కు చట్టం ద్వారా భూముల వివరాల్లో కేవలం 40 ఎకరాల 88 సెంట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు సమాధానం ఇచ్చారు. సర్వే నంబర్ 81.1లో 1.31 ఎకరాలు, 81.2 సర్వే నంబర్‌లో 1.40 ఎకరాలు ఇతరుల పేరిట క్రయవిక్రయాలు జరిగినట్లు తేలింది.