Minister DBV Swamy Comments On Vallabhaneni Vamsi Arrest : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దళితుడిని బెదిరించినందునే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారని ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి (డీబీవీ స్వామి) అన్నారు. ఇప్పుడు అమలవుతోంది అసలైన రాజ్యాంగమని చెప్పారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈక్రమంలో వంశీ తప్పు చేసినందునే పోలీసులు అరెస్టు చేశారన్నారు. వేధించాలంటే కూటమి ప్రభుత్వానికి ఎనిమిది నెలల కాలం అవసరం లేదని మంత్రి వ్యాఖ్యానించారు.
జగన్ హయాంలో తనతో సహా అందరిపైనా వందలాది అక్రమ కేసులు పెట్టారని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4 వేలు చేసిందని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వానికి రూ.వెయ్యి పెంచడానికి ఐదేళ్లు పట్టిందన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు మొదటి ఏడాదిలోనే అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. జగన్ (Jagan) హయాంలో చేసిన అప్పులను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తీరుస్తోందని మంత్రి డోలా చెప్పారు. రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధితో ముందుకెళుతోందని ప్రజలపై ఎక్కడా భారం మోపటం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
'ఆరోగ్య సమస్యలున్నాయి' - వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్
అపోహలు వద్దు- ఎవరినీ తొలగించడం లేదు : అంతకుముందు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో మంత్రి సమవేశమయ్యారు. ఆ ఉద్యోగుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పదోన్నతులు కల్పించాలని, పీఆర్సీ వేయాలని వినతులు వచ్చాయని మంత్రి తెలిపారు. ఎ, బి, సి కేటగిరీలుగా ఉద్యోగులను రేషనలైజేషన్ చేయాలని నిర్ణయించామని వివరించారు. సీనియర్ అధికారులతో కూడిన కమిటీని నియమించి సర్వీసు నిబంధనలు రూపొందిస్తామన్నారు. రేషనలైజేషన్ విషయం పైనా అధికారుల కమిటీ పరిశీలన చేస్తుందని తెలిపారు.
ఈ ప్రక్రియతో కొంతమందిని తొలగిస్తారనే అపోహలను కొందరు సృష్టిస్తున్నారని ఎవరినీ తొలగించడం లేదని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని శాఖల్లో చాలా ఖాళీలు ఉన్నాయన్నారు. మహిళా పోలీసుల విషయంలోనూ మహిళా శిశుసంక్షేమశాఖ, హోంశాఖలను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.