YSRCP Leaders Occupied Kalakshetram in Gudivada:గత ప్రభుత్వ హయాంలో కొందరు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలనే తేడా లేకుండా ప్రతీదీ ఆక్రమించేశారు. చివరకు స్మారక భవనాలనూ వదిలిపెట్టలేదు. అందుకు నిదర్శనమే గుడివాడలోని త్రిపురనేని రామస్వామిచౌదరి కళా క్షేత్రం. ఎంతో మంది కళాకారులు, రచయితలు, కవులను తీర్చిదిద్దిన కేంద్రంపై కబ్జాకోరుల కన్నుపడింది. స్థానిక ఎమ్మెల్యే అండతో ఆయన అనుచరులు ఈ భవనంలో పాగా వేశారు. వ్యాపార కార్యకలాపాల పేరుతో కోట్ల రూపాయల విలువైన ఆస్తిని వారి ఆధీనంలో ఉంచుకుని పెత్తనం చెలాయిస్తున్నారు.
ఇదే బారిష్టరు శతావధాని కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామిచౌదరి స్మారక కళాభవనం. గుడివాడ నడిబొడ్డున ఉంది. మున్సిపాలిటీకి చెందిన స్థలంలో 2 వేల చదరపు గజాలను కళా కేంద్రం నిర్మాణం కోసం కేటాయించారు. 1961లో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి స్మారకార్థం ఆయన కుమారుడు శివప్రసాదరావు ఆధ్వర్యంలో కళాభవనాన్ని నిర్మించారు. గుడివాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులు, రచయితలను ప్రోత్సహించే కార్యక్రమాలు జరిగేవి. రచనలు, పుస్తకాలు వేల సంఖ్యలో ఇక్కడే ఆవిష్కృతమయ్యాయి. ప్రముఖ కళాకారుల నృత్య ప్రదర్శనలు, పౌరాణిక నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇలాంటి ఘనమైన చరిత్ర ఉన్న కేంద్రం కొడాలి నాని ఎమ్మెల్యే అయిన తర్వాత కబ్జాకోరల్లో చిక్కుకుంది.
కోట్లు విలువైన స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు:గుడివాడలోని అత్యంత రద్దీగా ఉండే ఎన్టీఆర్ స్టేడియాన్ని ఆనుకునే ఈ కళాకేంద్రం ఉండడంతో స్థలం విలువ ఏటేటా పెరుగుతోంది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఈ స్థలం విలువ 25 కోట్లకుపైనే. దీనిపై మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరగణం కన్నేసింది. రకరకాల వ్యాపార కార్యకలాపాల పేరుతో కోట్ల విలువైన ఆస్తి, స్థలాన్ని తమ చెప్పుచేతుల్లో ఉంచుకున్నారు. ఈ కేంద్రం చుట్టూ 25 చిన్న దుకాణాలున్నాయి. కళాకేంద్రం ప్రధాన భవనంలో ఫర్నీచర్ దుకాణం నడుపుతున్నారు. పెద్ద హోటల్‌ను ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ కలిపి అద్దెల రూపంలో ఏటా 6 లక్షలు వస్తోందని లెక్కలు చూపిస్తున్నారు. ఆ డబ్బులు కూడా ప్రభుత్వానికి ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారు. ఈ కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి చేపట్టకుండా అడ్డుపడుతూ కోట్ల విలువైన స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారు.