YSRCP Leaders Irregularities in Guntur Mirchi Yard:అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లు ప్రతీ రంగంలోనూ గత ఐదేళ్లూ వైఎస్సార్సీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు. ఆఖరికి గుంటూరు మిర్చి యార్డునీ వదల్లేదు. అన్నదాతల కడుపు కొడుతూ అందినకాడికి దోచుకున్నారు. మిర్చి యార్డులో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. రైతులను మోసగిస్తూ వైఎస్సార్సీపీ నేతలు ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారు. ఎన్ని కోట్లు మేసేశారని తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.
అక్రమార్జనకు కల్పతరువుగా మిర్చి యార్డు : వైఎస్సార్సీపీ నేతల అక్రమార్జనకు గుంటూరు మిర్చి యార్డు కల్పతరువుగా మారింది. జగన్ హయాంలో యార్డులో భారీగా అక్రమాలు జరిగాయని టీడీపీ నాయకుడు, మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత ఐదేళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు తేల్చిన అధికారులు విజిలెన్స్ నివేదికను ప్రభుత్వానికి పంపారు. సరకు అమ్ముకోవడానికి వచ్చిన రైతులను వైఎస్సార్సీపీ నేతలు నిలువునా దోచుకున్నట్లు గుర్తించారు.
అన్నదాతల నుంచి 2 శాతం మాత్రమే అగ్రికల్చర్ సెస్ తీసుకోవాల్సి ఉండగా 4 నుంచి 5 శాతం మేర వసూలు చేసినట్లు విజిలెన్స్ పరిశీలనలో తేలింది. ఈనాం నిబంధనలకు పాతరేశారని పన్నుల రూపేణా ప్రభుత్వానికి దాదాపు రూ. 350 కోట్లు గండి కొట్టారని నివేదికలో పేర్కొన్నారు. ఒక్క జీఎస్టీ రూపేణా రూ. 289 కోట్లు, మార్కెటింగ్ సెస్ ఫీజుల రూపేణా రూ. 58 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు వివరించారు. నాటి మిర్చి యార్డు ఛైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు సుధాకర్‌రెడ్డి ఇష్టానుసారం వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేసి లంచాలు తీసుకున్నారని గుర్తించిన అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.
నిర్మించని గృహాలన్నీ రద్దు - ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం