YSRCP LEADERS IRREGULARITIES: ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేయడం! అవినీతి సొమ్ముతో గల్లాపెట్టెలను నింపుకోవడం, ఇదే వైఎస్సార్సీపీ బ్రాండ్ మార్కు! దిల్లీ స్థాయి చట్టసభల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నలుగురు ప్రజాప్రతినిధులది సైతం ఇదేమార్క్ పనితీరు. వారిలో రాయలసీమకు చెందిన ఇద్దరు, 'ముఖ్య'నేతకు రెండు కళ్లలా వ్యవహరిస్తుంటారు. మరో యువ నాయకుడికి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మద్యం సిండికేట్ బాధ్యతలు చూస్తుంటారు. ఉత్తరాంధ్ర తీరానికి చెందిన ఒక రియల్టర్ ప్రభుత్వ, ప్రజా ఆస్తుల కబ్జాదారుడిగా అవతారమెత్తారు. మరొకరు రాజధాని అమరావతికి విలన్‌గా మారారు.
పనితీరులో వినాశనమే:ఈ ప్రజాప్రతినిధిని రాష్ట్రానికే 'ముఖ్య' నేత తమ్ముడూ తమ్ముడూ అని పిలుస్తుంటారు. పార్టీలో కీలక నేత, దగ్గరి బంధువైన ఓ నాయకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆ జిల్లాలో ఈయన చెప్పిందే చెల్లుబాటు అవుతుందని చెబుతుంటారు. ఓ సంస్థలో అవసరం లేకపోయినా కొన్ని పనులు సృష్టించి మరీ వాటిని అనుచరులకు కట్టబెట్టారు. అందులోనూ కమీషన్లు నొక్కేశారు. ఈ జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, చట్టసభ సభ్యుడిగా అసలా విషయాన్ని హస్తినలో ప్రస్తావించనే లేదు. రాష్ట్ర ‘ముఖ్య’ నాయకుడు ఈ స్టీల్ ఫ్యాక్టరీకి రెండుసార్లు శంకుస్థాపన చేసినా పనుల్లో అడుగు కూడా ముందుకు పడలేదు. భూముల ఆక్రమణలు తప్ప సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఈ జిల్లా కేంద్రంలో కోట్ల విలువైన స్థలాన్ని ఒక సంస్థకు కట్టబెట్టడంలో ఈయన పాత్ర ఉందనేది చర్చనీయాంశమవుతోంది. మొత్తంగా ఈ నేత పనితీరులో వినాశనమే తప్ప అభివృద్ధి కనిపించని పరిస్థితి.
విశాఖ జిల్లాలో 'అవినీతి ముత్యం' - కనుమరుగవుతున్న ఎర్రమట్టి దిబ్బలు! - YSRCP Leaders Irregularities
అక్రమాల్లో మిధునమే: పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితుడైన ఈ ప్రజాప్రతినిధి అక్రమాల్లో మిధునమే. హస్తిన సభలో కీలక స్థానంలో ఉన్నా, రాష్ట్రానికి సాధించింది ఏమీ లేదు. రాయలసీమలోనే కాదు కోస్తా జిల్లాల్లోనూ చక్రం తిప్పుతూ బోలెడు అక్రమాలు చేశారు. ఈయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఒక గుత్తేదారు కంపెనీకి దాదాపు 6వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను సర్కారు అప్పజెప్పింది. రాష్ట్రంలో ఇసుక, మద్యం సిండికేట్ మొత్తం ఈయన కనుసన్నల్లోనే సాగుతుంటుంది. ఎర్రచందనం అక్రమరవాణాకూ పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు.
పేరుమోసిన స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఇంటికి తరచూ వెళ్తుండటం ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. పీలేరు పరిసరాల్లో 400 కోట్ల ప్రభుత్వ భూముల్ని అనుచరులకు పందేరం చేశారు. లోకాయుక్త విచారణలోనూ ఆక్రమణలు నిజమేనని తేలింది. ఈ అంశంలో అధికారులపై చర్యలు తీసుకున్నా, భూములు మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. పీలేరు సమీపంలో మరో 100 కోట్ల విలువైన ఏపీఐఐసీ భూములనూ ఇళ్ల పట్టాల పేరుతో ఆయన అనుచరులకే పంచేశారు. ఈయనకు చెందిన ఒక డెయిరీ, మామిడి గుజ్జు పరిశ్రమలు అన్నదాతలకు సరైన ధరను ఇవ్వడం లేదు. ఇతర డెయిరీలను ఆ ప్రాంతానికి రానివ్వడం లేదు. ఈయన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం ఆయన కనుసన్నల్లోనే మెలగాల్సి ఉంటుంది.
అక్రమాలలో ఈ 'అన్న'కు పోటీ ఎవరూ లేరు - అనుచరులను అడ్డుపెట్టుకుని భారీగా దోపిడీ - YSRCP LEADER IRREGULARITIES
రియల్ దందా చేస్తారనేది కాదనలేని సత్యం: విశాఖ తీరాన ఉండే ఈ ప్రజాప్రతినిధి రియల్ దందా చేస్తారనేది కాదనలేని సత్యం. ఈయనకు వివాదాస్పద భూములు కనిపిస్తే సంబరమే. అభివృద్ధి పేరుతో స్థలాలు తీసుకుని వైరి వర్గాన్ని బెదిరించడంలో దిట్ట. ప్రభుత్వ నిధులతోనే సొంత ఆస్తులకు, భవనాలకు దర్జాగా రోడ్లు వేయించుకుంటూ ఉంటారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆక్రమించడంతో ఆయనపై పోలీసులు రౌడీషీట్ సైతం తెరిచారు. అధికార పార్టీకి కోట్లలో నిధులు అందించి చక్రం తిప్పుతున్నారు. నగరంలో 2వేల అపార్టుమెంట్లు నిర్మించే ప్రాజెక్టులో స్థల యజమానులకు ఇచ్చింది 0.96 శాతం వాటా మాత్రమేనంటే, ఈ నేత దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎండాడలో వృద్ధులకు అన్ని రకాల వసతులతో కాలనీ ఏర్పాటు చేసేందుకు ఓ సంస్థకు 45 లక్షల చొప్పున 12.44 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమి విలువ ఇప్పుడు 300 కోట్లపైమాటే. అనంతరం ప్రాజెక్టు చేతులు మారగా, ఈ నేత అందులో భాగస్వామి అయ్యారు. ఆఖరికి వృద్ధుల కాటేజీలు కొండెక్కాయి. స్థిరాస్తి వ్యాపారం చేసుకుంటూ ఏకంగా 30 మందికి 1000 గజాల చొప్పున అమ్మేశారు. విశాఖ నగరపాలక కమిషనర్ బంగ్లాకు కొద్ది దూరంలోనే ఈ రియల్టర్ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా, ప్రశ్నించేవారే కరవయ్యారు. నగరంలో ఆయన సంస్థ చేపట్టిన నిర్మాణానికి రోడ్డు పోటు ఉందని ఏకంగా అక్కడున్న కూడలినే మూసివేయించిన ఘనుడీయన. అక్రమంగా టీడీఆర్ బాండ్లను హస్తగతం చేసుకోవడంలోనూ చక్రం తిప్పారాయన.
విశాఖ కార్పొరేషన్ 1800 గజాల స్థలాన్ని తీసుకోకుండానే 2041 బృహత్తర ప్రణాళిక రహదారి పేరుతో 63 కోట్ల విలువైన బాండ్లను చేజిక్కించుకున్నారు. సీతమ్మధార రేసపువానిపాలెంలో ఒక భూమికి సంబంధించి తన భాగస్వామి బంధువుతో 1000 కోట్ల టీడీఆర్ బాండ్లు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేయించారనే ఆరోపణలు వచ్చాయి. విశాఖ నగరంలోని విలీన వార్డుల్లో రోడ్లు అధ్వానంగా ఉంటాయి. కానీ, ఈ నేత వెంచర్లు చుట్టూ రోడ్లు తళతళలాడుతుంటాయి. ఆయన స్థలాలు ఉన్నచోటే మాస్టర్ ప్లాన్ రహదారులు కొత్తగా వస్తుంటాయి. బీచ్ రోడ్డులో, మధురవాడలో ఓ నాలుగు ప్రాజెక్టుల వద్ద వీఎంఆర్డీఏ నిధులతో రహదారి విస్తరణ చేశారు. కూర్మన్నపాలెంలో ఈ నేత ప్రాజెక్టుకు అన్నివైపులా విశాఖ కార్పొరేషన్ నిధులు 8 కోట్లతో రోడ్ల అభివృద్ధికి ఆమోదం పొందారు.
ఐదేళ్లలో రూ. వందల కోట్ల అక్రమార్జన - అవినీతి 'కాసు'లతో మల్టీప్లెక్స్ నిర్మాణం - YSRCP MLA Irregularities
అరటి తోటల కథ నుంచి ప్రజాప్రతినిధిగా:రాజధాని అమరావతి విలన్‌గా పాపులరయ్యాడు ఈ ప్రజాప్రతినిధి. అరటి తోటల కథ నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగిన క్రమంపై స్వయంగా బయోపిక్ తీయించుకుంటున్న ఘనుడు ఈయన. అమరావతిని కాపాడుకునేందుకు రైతులు రోజుల తరబడి నిరాహార దీక్ష చేస్తే, అందుకు పోటీగా పెయిడ్ ఆర్టిస్టులతో అక్కడే మూడు రాజధానుల శిబిరాన్ని నడిపించిన కథకుడు. అమరావతి రాజధాని వ్యతిరేకి అయిన ఈ నేత, గెలిచింది ఒకచోట, ఉండేది మరో చోట. ఇసుక, మట్టి దందాలో ఈయన కింగ్. ఇసుక రీచ్‌లు మూసివేయాలని హరిత ట్రైబ్యునల్ (NGT) ఆదేశించినా కదలిక లేదు. అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని, సొంతంగా లారీలు, టిప్పర్లు కొనుగోలు చేసి మరీ అయిదేళ్లుగా నిరాటంకంగా తోడేస్తున్నారు.
కొండగుట్టల్లోని మట్టినీ తరలించేశారు. విజయవాడలో ఒక పోలీసుస్టేషన్‌పైకి దండెత్తి.. మద్యం తాగి వాహనం నడుపుతున్నారని పోలీసులు తీసుకువెళ్లిన తన అనుచరులను విడిపించుకొచ్చారు. ఆయన అనుచరుడొకరు మద్యం తాగి వాహనం నడుపుతున్నాడని ఒక కానిస్టేబుల్ అడ్డుకున్నారు. దానికి ప్రతిగా పోలీసు అధికారులు ఈ నాయకుడికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఆయనకు నో రూల్స్ నంది అంటే నంది. ఇంకా ఏమైనా అంటే అదే.! ఈ నేత నివాసం వద్ద బయటి వారెవరైనా అనుమానంగా తిరిగితే, ఆపి దౌర్జన్యాలకు పాల్పడుతుంటారు. నియోజకవర్గ ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేరు. విజయవాడకు చెందిన ఒక మాజీ మంత్రి తనయుడితో కలిసి సెటిల్‌మెంటుల చేస్తుంటారు.
కొండలకు 'కన్నా'లు వేసే 'బాబు' - వసూళ్లలో రా'రాజు' - కాదంటే గన్ను గురిపెట్టి - YSRCP LEADER IRREGULARITIES
మెడలు వంచుతామని చెప్పిన ప్రజాప్రతినిధులు - అవినీతి సామ్రాజ్యాలకు పరిమితమయ్యారు (ETV Bharat)