YSRCP leaders distributes liquor and biryani:అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్సార్సీపీ నిర్వహించిన సిద్ధం సభ వద్ద మందుబాబులు హల్చల్ చేశారు. సభ సమీపంలోనే మందుబాబులు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ హంగామా చేశారు. మందుబాబులు కూర్చున్న వద్ద నుంచి పోలీసులు అటు ఇటు తిరుగుతున్న కనీసం వారిని హెచ్చరించిన పాపాన పోలేదు. చేతిలో వైఎస్సార్సీపీ జెండాలు తలపై టోపీలు పెట్టుకొని మద్యం సేవిస్తూ కనిపించారు. అటుగా వెళుతున్న మహిళలు అభద్రతకు గురయ్యారు. వైఎస్సార్సీపీ సిద్ధం సభ ఏమో కానీ ఇలాంటి సభల ద్వారా తీవ్రమైన ఎండలకు మద్యం సేవించి వ్యక్తుల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.
కోడిగుడ్డు, బిర్యానీ ప్యాకెట్ ఆఫర్: మరోవైపు సభకు వచ్చే జనానికి పంచిన డబ్బు, మళ్లీ ప్రభుత్వ ఖజానాకు చేరేలా పక్కా ప్లాన్ చేసేశారు వైసీపీ నేతలు. కదిరి నియోజకవర్గంలో మద్యం దుకాణం వద్దనే నోట్ల కట్ట పట్టుకొని మనిషికి రూ.500 చొప్పున పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ తీసుకున్న రూ.500 అక్కడే జగనన్న మద్యం దుకాణంలో తప్పనిసరిగా మద్యం కొనుగోలు చేయాలి. మద్యం కొనుగోలు చేసిన వారికి ఉడికించిన కోడిగుడ్డు, బిర్యానీ ప్యాకెట్ ఆఫర్ ఉంటుంది. ఇవన్నీ తీసుకున్న వారంతా సిద్ధం సభకు బస్సు ఎక్కాల్సిందే. ఈ ప్యాకేజీని పర్యవేక్షణ చేయటానికి వైఎస్సార్సీపీ నాయకులు గట్టి చర్యలు తీసుకుని జనాల్ని బస్సులు ఎక్కించారు. ఇంకేముంది అందరూ చేతిలో మద్యం బాటిల్ పట్టుకొని బస్సు ఎక్కటం, నడిచే బస్సులోనే మద్యం తాగుతూ, జగన్ కు జేజేలు పలికారు.
సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ప్రభుత్వ ఉద్యోగులు- ఆందోళనలు, ర్యాలీలతో హోరెత్తిన రాష్ట్రం