YSRCP Leaders Attack on Chandragiri TDP MLA Pulivarthi Nani:రాష్ట్రంలో పోలింగ్ ముగిసినా తిరుపతి జిల్లా చంద్రగిరిలో మాత్రం వైఎస్సార్సీపీ విధ్వంసకాండ ఆగలేదు. పద్మావతి మహిళా వర్శిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై చెవిరెడ్డి అనుచరులు, వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు చెవిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడిని నిరసిస్తూ మహిళా వర్సిటీ రహదారిపై బైఠాయించి పులివర్తి నాని నిరసన తెలిపారు.
ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి వారి అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి వస్తున్న పులివర్తి నాని పైన 150 మందికి పైగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు దారికాచి రాడ్లు, కత్తులు, సమ్మెట్లతో దాడి చేశారని ఆరోపించారు. నడవలూరు సర్పంచ్ గణపతి పులివర్తి నానిపై దాడి చేశారని చెబుతున్నారు. ఈ దాడిలో నాని కారు ధ్వంసమైంది.
ఈవీఎమ్‌లు భద్రపరిచిన పద్మావతి మహిళా వర్సిటీలోనే వైఎస్సార్సీపీ శ్రేణులు దాడులకు తెగబడటంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. స్ట్రాంగ్‌రూమ్ పరిశీలన వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.