Missing Man Returns Home After 25 Years: పెద్దిరాజు అనే వృద్ధుడు 25 ఏళ్ల తర్వాత కుటుంబీకులను కలుసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం యలమంచిలిలంక అనే గ్రామానికి చెందిన పేకేటి పెద్దిరాజు (60) అనే వృద్ధుడు ఇంటి నుంచి తప్పిపోయి 25 ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నం చేసినా పెద్దిరాజు ఆచూకీ దొరకలేదు.
ఇటీవల న్యూ ఇయర్ వేడుకలు పురస్కరించుకుని చెన్నైలోని ఉదవుం కరంగళ్ స్వచ్ఛంద సంస్థ ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్న క్రమంలో వృద్ధుడిని గమనించింది. రెడ్ హిల్స్‌లో చిరిగిన దుస్తులతో దీనస్థితిలో ఉన్న వృద్ధుడిని సంస్థ ప్రతినిధులు చూశారు. ఆ సమయంలో తనలో తానే మాట్లాడుకుంటుండగా ఆయనను గుర్తించి చెన్నైలోని తిరువేర్కాడులోని శాంతి వనంలో చేర్చారు. అనంతరం సంస్థ ప్రతినిధి వృద్ధుడిని వివరాలు అడిగి యలమంచిలిలంకకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పెద్దిరాజు కుమారుడు గంగా సురేష్, ఇతర కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆశ్రమానికి వెళ్లి పెద్దిరాజును స్వగ్రామం యలమంచిలిలంకకు తీసుకువచ్చారు. 25 ఏళ్ల తర్వాత తమ తండ్రి ఇంటికి రావడంతో కొత్త సంవత్సరం రోజున కొత్త పండగ వాతావరణం ఇంటిలో నెలకొందని ఆనందం వ్యక్తం చేశారు. తమ తండ్రిని అప్పగించిన ఉదవుం కరంగళ్ సంస్థకు పెద్దిరాజు కుమారులు కృతజ్ఞతలు తెలిపారు.
"మా ఊరు యలమంచిలిలంక. నా పేరు పేకేటి రమేష్ బాబు, మా తమ్ముడి పేరు పేకేటి గంగా సురేష్. మా నాన్న పేరు పేకేటి పెద్దిరాజు. మా నాన్న మతిస్థిమితం లేక 25 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. మేము చాలా ఊళ్లలో ట్రై వెతికాం. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. న్యూఇయర్ రోజున మాకు చెన్నై నుంచి ఫోన్ వచ్చింది. పేకేటి పెద్దిరాజు ఏమవుతారు అని అడిగారు. మాకు నాన్న అవుతారు అని చెప్పాము. చెన్నైలో ఆయన ఉన్నారు అంటే వెంటనే వెళ్లి తీసుకువచ్చాం. ఇప్పుడు మా కుటుంబ సభ్యులు అంతా సంతోషంగా ఉన్నారు". - పేకేటి రమేష్ బాబు, పెద్దిరాజు కుమారుడు
మేకలతో వెళ్లి అడవిలో తప్పిపోయిన వృద్ధురాలు - వారం రోజులు ఎలా గడిపిందంటే!