YSRCP Leader lokanadham Attack on Women :విశాఖ జిల్లా గాజువాకలో ఒంటరి మహిళపై వైఎస్సార్సీపీ నాయకుడి హత్యాయత్నం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు కాలిన గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా నిందితులను రక్షించేందుకు యత్నిస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
కక్ష పెంచుకున్న అధికార పార్టీ నేత : విశాఖ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలోని 65 వార్డులో నివాసం ఉంటున్న వివాహితపై వైఎస్సార్సీపీ నాయకుడి హత్యాయత్నం ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జలుమూరి రాధ అనే మహిళ ఇంటికి కుళాయి వేయిస్తానని 65వ వార్డు అధికార పార్టీ అధ్యక్షుడు లోకనాథం 20 వేల రూపాయలు తీసుకున్నాడని బాధితురాలి బంధువులు తెలిపారు.
నెలలు గడుస్తున్నా పని కాకపోవడంతో ఆమె నిలదీసిందని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థలానికి పట్టా ఇప్పిస్తా మరో 50 వేలు ఇవ్వాలని లోకనాథం అడిగినా రాధ ఇవ్వలేదని అన్నారు. కక్ష పెంచుకున్న లోకనాథం ఆ స్థలంలో ఉన్న రేకులు, ఐరన్ రాడ్లు తీసేశారని, దీనిపై బాధితురాలు న్యూ పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీనిపై సీఐ చర్యలు తీసుకోకపోవడంతో ఫిబ్రవరి 26న సీపీ స్పందన కార్యక్రమంలో బాధితురాలు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ ఫిర్యాదు మళ్లీ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ వద్దకే వచ్చిందని అన్నారు.
కేజీహెచ్‌లో బాధితురాలు : ఇదే సమయంలో ఈ నెల 11న లోకనాథం కుటుంబసభ్యులు రాధ ఇంటికి పొరుగున వున్న అరుణ అనే మహిళ స్ధలంలోకి వచ్చి కబ్జాకు యత్నంచారు. సదరు స్ధలంలో ఉన్న కంపకు పెట్రోలు పోసి నిప్పుపెట్టి ఖాళీ చేయించేందుకు యత్నించగా ఆ మహిళకు రాధ అండగా నిలబడింది. దీంతో రాధను లోకనాథం మంటోల్లోకి తోసేశాడు. ఈ అమానవీయ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖం కాలి చర్మం ఊడిపోయింది. ఎడమచేతికి ఫ్రాక్చరైంది. స్థానికులు ఆమెను కేజీహెచ్‌కు తరలించారు.