Rain Alert in Andhra Pradesh : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి తుపానుగా మారినట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. దీనికి ఫెయింజల్‌గా నామకరణం చేశారు. తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదిలింది. పుదుచ్చేరి-మహాబలిపురం దగ్గర తుపాను తీరాన్ని తాకింది. తుపాను పూర్తిగా తీరం దాటడానికి మరికొంత సమయం పట్టనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
70-90కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు : ఫెయింజల్ తుపాను అత్యంత నెమ్మదిగా కదులుతోంది. పూర్తిగా తీరంపైకి వచ్చిన తర్వాత బలహీనపడనుంది. రాత్రి 11.30 సమయానికి తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తిరుపతి, నెల్లూరు, ప్రకాశం తీరం వెంబడి 70-90కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్కు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.
పోర్టులకు హెచ్చరికలు జారీ : రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఇన్‌ఛార్జి డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాసరావు తెలిపారు. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని సూచనలు చేశారు.
కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబర్, మచిలీపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు రెండో నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుపాను ప్రభావంతో తమిళనాడులోని ఏడు జిల్లాలకు రెడ్‌అలెర్ట్ జారీ చేశారు. తంజావూరు, విళుపురం, నాగపట్టిణం, మయిలాడుదురై, తిరువారూరు, కడలూరు జిల్లాలకు విపత్తు నిర్వహణ దళాల్ని పంపించారు. ప్రభావిత జిల్లాల్లో 2229 సహాయక కేంద్రాలను సిద్ధం చేశారు.
భక్తుల ఇబ్బందులు : ఫెయింజల్ తుపాన్ ప్రభావంతో తిరుమలలో వర్షం దంచికొడుతుంది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు చిరుజల్లులు కురువగా అర్ధరాత్రి వర్షం తీవ్రత ఎక్కువైంది. వర్షంతో పాటు బలంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. తిరుమల అంతట దట్టంగా పొగ మంచు కమ్మేసింది. దీంతో కొండపై చలి తీవ్రత పెరిగింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు దర్శనానంతరం లడ్డూ ప్రసాదం, గదులకు చేరేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు.
విమానాలు రద్దు: తుపాను వల్ల చెన్నైలో విమానాలకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఈ ప్రభావంతో హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్లాల్సిన 3 విమానాలు, తిరుపతికి వెళ్లాల్సిన 7 విమానాలు రద్దు అయ్యాయి. అలాగే చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన 3 విమానాలు, తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన 7 విమానాలను రద్దు చేశారు. ముంబయి, దిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన 2 విమానాలు దారి మళ్లించారు. చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమానాలు రద్దు అయ్యాయి.
వాతావరణ శాఖ అలర్ట్ల గురించి తెలుసా? - ఏ అలర్ట్ ఇస్తే ఏం జరుగుతుందంటే!