Acid Attack on RTC Bus : ఆ ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఓ ఆర్టీసీ బస్సు ఎక్కారు. కొద్ది సేపు వారి ప్రయాణం సజావుగానే సాగింది. ఇంతలోనే ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ బస్సుపై యాసిడ్ విసిరాడు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోపే అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలపై పడింది. ఈ ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
విశాఖలోని ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి బీఆర్టీఎస్ రహదారిపై ప్రయాణిస్తున్న 28ఎ/జీ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ విసిరాడు. దీంతో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ముగ్గురు మహిళలపై అది పడింది. దీంతో వారు కళ్లు మండి వారు కేకలు వేశారు. వెంటనే డ్రైవర్ బస్సును నిలిపేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో కంచరపాలెం సీఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందించగా కొద్ది సేపటికే సాధారణ స్థితికి వచ్చారు.
RTC Bus Acid Attack in Visakha : బస్సు అద్దాలపై పడిన ద్రావకాన్ని పోలీసులు పరిశీలించారు. నమూనాలను క్లూస్ టీం సేకరించింది. ద్రవాన్ని నిర్ధారించడానికి నమూనాని ఎఫ్ఎస్ఎల్కి పంపినట్లు పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. డ్రైవర్, బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకున్నామని వారు వెల్లడించారు.
దీనిపై విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ స్పందించారు. బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ విసిరాడని పేర్కొన్నారు. అది అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలపై కొంత యాసిడ్ పడిందని చెప్పారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని త్వరలోనే గుర్తిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖలో బస్సుపై యాసిడ్ దాడి ఘట బాధాకరమని రవాణా శాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. గాయపడిన ముగ్గురు ప్రయాణికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని మండిపల్లి వివరించారు.
Acid Attack on woman: దారుణం.. ఎన్టీఆర్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి