YSRCP Leader Land Encroachment :నెల్లూరు జిల్లాలో ఇంకా వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో భూ కబ్జాలు చేస్తున్నారు. ఫిర్యాదులు ఇచ్చినా రెవెన్యూ అధికారులు స్పందించడంలేదు. ఏ.ఏస్.పేట మండలంలో ఓ వైఎస్సార్సీపీ నాయకుడు గ్రామస్థులను బెదిరించి ఏకంగా 20 ఎకరాలు ఆక్రమించాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే తన పొలం పక్కనే ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. గ్రామస్థులు ఫిర్యాదు చేస్తే వారిని బెదిరిస్తున్నాడు. గ్రామస్థులు వేసుకున్న రోడ్డును ధ్వంసం చేయడంతో వారం కిందట మరోసారి అధికారులకు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట (ఏ.ఎస్.పేట) మండలంలోని గుడిపాడుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడి దాదాగిరి ఇది. ఆయనే జనార్ధన్ రెడ్డి. ఈయన ఒక రేషన్ దుకాణం డీలర్. అదే విధంగా వార్డు కౌన్సిలర్. ఇతను మండల స్థాయిలో వైఎస్సార్సీపీ కీలక నాయకుడు. ఐదేళ్లుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. నన్ను ఎవరు ఏం చేస్తారంటూ అధికారులను కూడా బెదిరించాడు.
గుడిపాడు గ్రామంలో ఆయనకు ఐదు ఎకరాలు పొలం ఉంది. చాలదన్నట్లు పక్కనే ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. రెవెన్యూ అధికారుల బలంతో వాటికి అక్రమ పట్టాలు కూడా సృష్టించాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆక్రమించిన పొలంలో గ్రామస్థులు చందాలతో నిర్మాణం చేసుకున్న గ్రావెల్ రోడ్డును ధ్వంసం చేశాడు. కొందరు రైతులు వారి పొలాలకు వెళ్లాలంటే ఈ రోడ్డు అవసరం ఉంది. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు.