YSRCP Leader Irregularities in Srikakulam :శ్రీకాకుళం జిల్లాలో చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నగరాలకు అందుబాటు దూరంలో ఉన్న నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి ఆయన. దీంతో ఇక్కడ భూముల ధరల మాదిరే స్థిరాస్తి లావాదేవీలూ విపరీతంగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఎవరైనా వెంచర్ వేయాలంటే ఆ ప్రజాప్రతినిధి అడిగినంత కప్పం కట్టాల్సిందే. అందుకు అంగీకరించని వారిని అధికారుల సాయంతో ఇబ్బంది పెడతారు. సొమ్ములు చెల్లించిన తర్వాతే వెంచర్ కార్యకలాపాలు జరిగేవి. విద్యాసంస్థలకు కేంద్రమైన ఓ ప్రాంతంలో ఎవరు కొత్తగా ఇల్లు కట్టుకున్నా, వెంచర్ వేసినా, అపార్ట్‌మెంట్ నిర్మించినా అందులో ఏదో ఒక కారణం చూపి వసూళ్లు చేశారు. సదరు ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడే ఈ దందాలంతా నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ సైతం కటకటలాడిన ఆ ఎమ్మెల్యే, గత అయిదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లకు పడగలెత్తారు.
నియోజకవర్గంలోని ఓ గ్రామం పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. టీడీపీ హయాంలో ఆ గ్రామస్థులు చందాలు వసూలు చేసుకుని ఓ 50 ఎకరాలు బాగు చేసుకున్నారు. దాన్ని భూమి లేని పేదలంతా సాగు చేసుకోవాలనుకున్నారు. ఈ ప్రజాప్రతినిధి గెలిచిన వెంటనే ఆ భూమిని ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేసి తన ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అందులో కొబ్బరి సాగు చేస్తున్నారు. మండల పరిషత్ నిధులతో ఆ తోటకు కంకర రహదారి నిర్మించుకున్నారు. కుటుంబ సభ్యులకు చెందిన భూమిని కూడా అందరికీ పంచకుండా, అధికార బలంతో ఆయనొక్కరే నొక్కేశారు.
కొన్నాళ్ల కిందట ప్రభుత్వం 246 ఎకరాల భూములకు సంబంధించి డీ పట్టాలు పంపిణీ చేసింది. ఆ లబ్ధిదారుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారీ నేత. ఆ భూముల క్రమబద్ధీకరణలోనూ పెద్ద ఎత్తున దండుకున్నారు. జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఒక నాయకుడికి చెందిన భూమి విక్రయం విషయంలో సుమారు 20 కోట్లు ఆర్జించారు. చెరువు గట్లను పూడ్చేసి ఈ భూమికి రహదారిగా చూపారు. ఉపాధి హామీ పథకం కింద 31 లక్షలతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టించి మంజూరు చేయించుకున్నారు. ఈ రోడ్డు నిర్మిస్తే చిక్కులు వస్తాయని అధికారులు వెనకడుగు వేయడంతో పనులు ప్రారంభం కాలేదు. ఓ పత్రిక కార్యాలయం పక్కన మూడేళ్ల కిందట కొంతమంది వ్యాపారులు కలిసి 42 ఎకరాల్లో వెంచర్ వేశారు. అందులో డీ పట్టా భూమి ఉందంటూ ఆ యజమానులను బెదిరించి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు గుంజేశారు. సెటిల్‌మెంట్లలోనూ ఆయన తీరు భిన్నంగా ఉంటుందని చెబుతుంటారు.