YSRCP Irregularities in kuppam Dravidian University :ద్రవిడ భాషలు, సంస్కృతి, సాహిత్యంపై పరిశోధనలను ప్రోత్సహించే ఉన్నతమైన లక్ష్యంతో ఏర్పాటు చేసిన ద్రావిడ విశ్వవిద్యాలయం గత వైఎస్సార్సీపీ పాలనలో అక్రమాలకు అడ్డాగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలను రాజకీయ పునరావాసాలుగా మార్చి విద్యా వ్యవస్థను కుప్పకూల్చిన తరహాలోనే గత పాలకులు ద్రావిడ విశ్వవిద్యాలయ ప్రమాణాలను దిగజార్చారు. రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించిన వేణుగోపాల్‌రెడ్డి అవకతవకలకు పాల్పడి వర్సిటీ ప్రతిష్టను మసకబార్చారని విమర్శలున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ద్రావిడ సంస్కృతిలోని విలక్షతను విశ్వానికి చాటి చెప్పాలన్న మహోన్నతమైన లక్ష్యంతో ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ద్రావిడ భాషలు, సాహిత్యం, సంస్కృతిపై విస్తృతమైన పరిశోధనలు, ప్రచురణల సంకల్పంతో 1997లో ద్రావిడ విశ్వ విద్యాలయం నెలకొల్పారు. ద్రవిడ భాషలపై పరిశోధనలకు అనువైన తులనాత్మక ద్రావిడ సాహిత్యం, ద్రావిడ తత్వం, ద్రావిడ జానపద గిరిజన విజ్ఞాన శాఖ తెలుగు అనువాద అధ్యయన శాఖ, ద్రావిడ సమాజ అధ్యయనం కోర్సులను వర్సిటీలో అందుబాటులోకి తెచ్చారు.
వీటితో పాటుగా స్వీయ ఆర్థిక స్వావలంబన కలిగించేందుకు వీలుగా గణితం, ఆర్థికశాస్త్రం, వృక్షశాస్త్రం వంటి కోర్సులను ప్రవేశపెట్టారు. విశ్వవిద్యాలయం ఏర్పాటైన నాటి నుంచి కుప్పం ప్రాంత అభివృద్ధిలో ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని భాగస్వామిగా చేస్తూ వర్సిటీ సర్వతోముఖాభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారు. గడచిన ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో మితిమీరిన రాజకీయ ప్రమేయం వ్యవస్థల్ని లెక్కచేయనితనంతో వర్సిటీ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది.