Neglect of Parks During YSRCP Regime :విజయవాడలో పలు పార్కులు కళాహీనంగా తయారయ్యాయి. నగరంలో 64 డివిజన్లలో మొత్తం 177 పార్కులు ఉన్నాయి. వీటిలో కొన్ని పార్కులు పిచ్చి మొక్కలు, అదుపు లేకుండా పెరిగిన గడ్డితో దర్శనమిస్తున్నాయి. ఫలితంగా ఇంటిల్లిపాదీ పార్కుకు వెళ్లాలంటే హడలిపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం, విజయవాడ కార్పొరేషన్ కేవలం కమర్షియల్ పార్కులపైనే దృష్టి పెట్టింది. రాఘవయ్య పార్కు, అంబేడ్కర్, రాజీవ్ గాంధీ, కేఎల్‌రావు పార్కులను మాత్రమే ఆధునికీకరించారు. కాలనీల్లో ఉద్యానాలకు నిధులు కేటాయించకుండా పూర్తిగా విస్మరించారు. పలు పార్కులు నిర్వహణ లేక అధ్వానంగా మారి బ్లేడు బ్యాచ్‌లకు ఆవాసాలయ్యాయి. పార్కుల నిర్వహణను కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు.
People Facing Problems In Parks Due to Lack of Minimum Facilities : సెలవు రోజుల్లో కుటుంబంతో సరదాగా గడపడానికి వీలు లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ నిర్లక్ష్యంతో పార్కులన్నీ నిర్వీర్యమైపోయాయని వారు వాపోతున్నారు. కనీసం పిల్లలు ఆడుకోవడానికు కూడా సరైన సదుపాయాలు లేకపోవడం దారుణమని అంటున్నారు. దాతలు ముందుకొచ్చి పార్కులను అభివృద్ది చేద్దామనుకున్నా వారికి ఏదో ఓ ఆటకం ఎదురవుతుందని ఆవేదన చెందుతున్నారు. పార్కు సురక్షితంగా ఉండడానికి పారిశుద్ద కార్మికులు కూడా లేకపోవడం దారణమన్నారు.
'చాలామంది దాతలు తమ స్థలాన్నే పార్కుల నిర్వహణ కోసం దానం చేశారు. అలాంటి పార్కులు సైతం నిర్వహణ లేక, దాతలే దగ్గరుండి పరిరక్షించాల్సి వస్తోంది. మొక్కలకు నీళ్లు పట్టేవాళ్లు లేరు. ప్రమాదకరమైన గడ్డి మొక్కలు ఎక్కువవుతున్నాయి. బల్లులు విరిగిపోయాయి. పెద్దలు కూర్చోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి సరైన సౌరర్యాలు లేవు. శుభ్రం చేసేవాళ్లు, పార్కులో ఏం జరిగినా అడిగేవాళ్లు లేకపోవడం చాలా దుర్భరం.' -నాగేశ్వరరావు, విజయవాడ