City Sanitation Situation in AP :పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి అని గుర్తించిన గతంలో తెలుగుదేశం ప్రభుత్వం సచివాలయంలోని రెండో బ్లాకులో కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. అన్ని పట్టణ స్థానిక సంస్థలను ఇందులో భాగస్వాములను చేసింది. 2017లో సెంటర్ ఏర్పాటయ్యాక సాంకేతిక సిబ్బందితో నగరాలు, పట్టణాల్లో సర్వే చేయించి నిత్యం చెత్త పేరుకుపోయే 21 వేల ప్రాంతాలను గుర్తించి ఫొటోలు తీయించారు. వీటిని బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించి సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్, సూపర్‌వైజర్ వివరాలతో మ్యాపింగ్ చేశారు. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులతో రోజూ శుభ్రం చేయించే బాధ్యతను వారికి అప్పగించి కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రోజూ దాదాపు 60 మంది సాంకేతిక సిబ్బంది సెంటర్‌లో సేవలు అందించేవారు. మంచి ఫలితాలు వస్తున్న దశలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును పక్కన పెట్టి నిర్వీర్యం చేసింది.
Sanitation Problems in Andhra Pradesh :కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ రూపురేఖలు మార్చేసిన ప్రభుత్వం మున్సిపాలిటీలో ప్రజల సమస్యలపై వచ్చే ఫిర్యాదులను జగనన్నకు చెబుదాం కార్యక్రమానికే పరిమితం చేసింది. ఆన్‌లైన్‌లో నమోదైన సమస్యలు, సేవలకు సంబంధించి నిర్దేశించిన గడువులోగా పరిష్కారమయ్యాయా? సేవలు అందించారా? లేదా అనే దానిపై ఇక్కడ నుంచి సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. జాప్యమైతే సంబంధిత పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లకు సమాచారం పంపుతారు. కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్‌లో బ్లాక్ స్పాట్‌ల పర్యవేక్షణకు గతంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లను పక్కన పెట్టేశారు. సిబ్బంది సంఖ్యను తగ్గించారు.
గతంలో పట్టణ స్థానిక సంస్థల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉన్న 21 వేల బ్లాక్ స్పాట్‌లలో ప్రతి రోజూ ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి 8గంటల 30 నిమిషాల్లోపు సిబ్బందితో సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్, సూపర్‌వైజర్ శుభ్రం చేయించేవారు. శుభ్రం చేసిన ప్రాంతాల చిత్రాలను 4 దశల్లో తీయించి ఇందుకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులో అప్‌లోడ్ చేసేవారు. వీటిని సచివాలయంలోని కమ్యూనికేషన్ సెంటర్ సాంకేతిక సిబ్బంది ఆడిట్ చేస్తుండేవారు.