YSRCP Government Neglected Irrigation Canals in Nellore District :పంటలు సమృద్ధిగా పండటంలో సాగునీటి కాలువలు కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి సాగునీటి కాలువల నిర్వహణను గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా కనిగిరి రిజర్వాయర్ పరిధిలోని సాగు నీటి కాలువల్లో పూడికలు తీయకపోవడంతో పంటలకు నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నీరందక రైతుల తీవ్ర ఇబ్బందులు :జిల్లాలోని కోవూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, అల్లూరు ప్రాంతాల్లో సాగు నీటి కాలువల నిర్వహణ అధ్వానంగా తయారైంది. పూడికలు తీయకపోవడంతో కంప చెట్లు పెరిగి కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా కనిగిరి రిజర్వాయర్ పరిధిలో 2 లక్షల ఎకరాల పంట సాగవుతోంది. ఇక్కడ వేగూరు, రంగారెడ్డి, పుల్లారెడ్డి, ఇనమడుగు, చెర్లోపాలెం, లేగుంటపాడు కాలువలు అధ్వానంగా మారాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కాలువలను నిర్లక్ష్యం చేయడంతో పంటలకు నీరందక తీవ్ర ఇబ్బందులు పడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలువలు శిథిలం - పట్టించుకోని పాలకులు - ఆందోళనలో అన్నదాతలు - Canals in Ruins
నిధులు దండుకున్నారు :వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి కాలువలను బాగు చేయాలని కోరినా ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులే తమ సొంత ఖర్చులతో కాలువలను బాగు చేసుకున్నారు. కొందరు నాయకులు తాత్కాలికంగా కాలువల్లోని పూడికలను తొలగించి నిధులు దండుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతల నిర్లక్ష్యం ఫలితంగా పొలాలకు నీరందక నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.