YSRCP Govt Neglected Construction of Gilakaladindi Harbour:రాళ్ల కుప్పలు, బురద మేటలు, గాల్లో వేలాడుతున్న ఇనుప చువ్వలు, అసంపూర్తిగా వెక్కిరిస్తున్న నిర్మాణాలు. ఇదీ కృష్ణా జిల్లా గిలకలదిండిలో ఫిషింగ్ హార్బర్ పేరుతో వైఎస్సార్సీపీ సర్కార్ వెలగబెట్టిన పనులు. 2023 మార్చి నాటికి ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని నాటి ప్రభుత్వ పెద్దలు ప్రగల్భాలు పలికారు. కరోనా సాకుతో 2024 సెప్టెంబర్‌కు గడువు పొడిగించారు. ఎప్పటికప్పుడు జాప్యం చేస్తున్న గుత్తేదారు సంస్థ ఇంకో నెలలో పూర్తిచేయడం అసాధ్యం.
ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో మొత్తం 14 లక్షల మెట్రిక్ టన్నుల మట్టి తొలగించాల్సి ఉంది. వేటకు వెళ్లి వచ్చే బోట్లను ఇరువైపులా నిలిపేందుకు వీలుగా 764 మీటర్లు జెట్టీ నిర్మించాలి. తిరిగి ఈ ప్రాంతంలో మట్టి పూడిక పడకుండా చేపట్టిన బ్రేక్ వాటర్ పనులు కూడా వందశాతం పూర్తికాలేదు. చేపల గోదాములు, టూనా ఫిషింగ్ ఆక్షన్ హాలు, ఐస్ ప్లాంటు, లోడింగ్, ప్యాకింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. బ్రేక్ వాటర్ వద్ద మత్స్యకారులు దారి తప్పిపోకుండా లైట్ హౌస్ తరహాలో అడ్వాన్స్ నావిగేషన్ సౌకర్యం కల్పించాల్సి ఉంది.
టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు - వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసుల నోటీసులు - Notice to YSRCP Central Office
అరుదైన మత్య సంపద లభ్యమయ్యే ప్రాంతంగా గిలకలదిండికి గుర్తింపు ఉంది. 1610 నుంచే ఇక్కడి చేపలు, రొయ్యలు, పీతలను విదేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేసేవారు. మత్స్య సంపదను తీరంలోనే ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేసేందుకు వీలుంది. రోజూ టన్నుల కొద్దీ సరకు లారీల్లో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఏటా 2 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. ఐనా కనీస మౌలిక వసతులు కానరావడం లేదు. ఫిషింగ్ హార్బర్ మట్టితో పూడుకుపోయి బోట్లు కూరుకుపోతున్నాయి. నష్టాలు భరించలేక మత్స్యకారులు వేరే వృత్తి చూసుకుంటున్నారు. గతంలో 200 బోట్ల వరకూ గిలకలదిండిలో వేటకు వెళ్లేవి. ఇప్పుడు వందకే పరిమితమయ్యాయి. హార్బర్ నిర్మాణంలో జాప్యం ఉపాధికి ఇబ్బందిగా మారింది.
వైఎస్సార్సీపీ సర్కార్ మత్స్యకారులను మభ్యపెట్టి ఫిషింగ్ హార్బర్ పేరుతో కమీషన్లు కొట్టేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రస్తుత పనుల పురోగతిని సమీక్షించి గుత్తేదారును కొనసాగించాలా, వేరొకరికి అప్పగించాలా అనేది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఓ స్పష్టమైన ప్రణాళికతో ఏడాది వ్యవధిలో హార్బర్ పూర్తిచేస్తామని తెలిపారు. కొత్త ప్రభుత్వం త్వరితగతిన హార్బర్ పూర్తిచేసి తమ ఉపాధికి భరోసా ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు.
'టీడీపీ గెలిస్తే కొవ్వు పెరిగిందా?' - హెడ్ కానిస్టేబుల్ దూషించాడని మహిళల ఆవేదన - Head Constable Abused Women
రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానం - అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం చంద్రబాబు - CM Review on New Energy Policy